స్థానికఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చేసింది. అంటే కరోనా తగ్గే వరకూ ఎన్నికలు ఉండనట్లే. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా నిర్వహించేలా చేయాలని ప్రయత్నించిన ఏపీ సర్కార్‌కు కరోనా అడ్డం వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోబోమని..సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఇక ఎన్నికలు ఆరు వారాల పాటు జరగడం సాధ్యం కాదని తేలిపోయింది. ఆ తర్వాత కూడా…కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చినట్లుగా కేంద్రం నిర్ధారించి.. జాతీయ విపత్తు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటేనే జరుగుతుంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ రెండో స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు.. పలు ప్రభుత్వాలు.. కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటం వంటి కారణాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఆరు వారాల తర్వాత ఎన్నికలు జరుగుతాయా.. లేదా అన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం…
ఎన్నికల కోడ్‌ను మాత్రం సుప్రీంకోర్టు ఎత్తి వేసింది. కొత్త పథకాలు ఏవీ ప్రవేశపెట్టవద్దని .. పాత పథకాలు కొనసాగించుకోవచ్చని సూచించింది. ఒక వేళ.. పరిస్థితి అంతా సద్దుమణిగి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఓ సారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరవాత మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం అంటే.. ప్రక్రియ మొత్తం కొత్తగా ప్రారంభించినట్లేనన్న వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే.. ప్రస్తుతం ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం.. ఇరవై రోజులకు అటూ ఇటూగా అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. అనూహ్య కారణాలతో వాయిదా పడ్డాయి. దీంతో.. ఆ ఆర్డినెన్స్ ప్రకారం చూసినా… ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారినట్లేనన్న అంచనాలున్నాయి.
ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ వాయిదా మాత్రమే పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోంది. మామూలుగా నామినేషన్ల ఉపసంహరణకు ఒక్క రోజు గడువు. కానీ ఇప్పుడు… చాలా రోజులు సమయం ఇచ్చినట్లు అవుతోంది. అధికార పార్టీ నేతలు… బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఏకగ్రీవాల విషయంలో.. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి.. విపక్ష పార్టీలపై దాడులు, దౌర్జన్యాలకు దిగి.. ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటి కారణంగా..ఎన్నికల ప్రక్రియను.. ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచి కొనసాగించడం సాధ్యం కాదన్న అంచనాలు సహజంగానే వస్తున్నాయి.
ఎన్నికల కమిషనర్ కూడా.. ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారయంత్రాంగం సహకరించలేదని.. తప్పుడు నివేదికలు ఇచ్చారని… అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు అయ్యాయని కేంద్రానికి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియను ఎక్కడ ఆపేశారో.. అక్కడి నుంచే కొనసాగించాలో లేదో.. పూర్తిగా ఎన్నికల సంఘం విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా..న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని.. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే తేలిపోయిందని.. న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఇప్పుడు బంతి ఎస్ఈసీ పరిధిలోనే ఉంది. ఎస్ఈసీ రాసిన లేఖ ప్రకారం చూస్తే.. మళ్లీ మొదటి నుంచే ప్రారంభం కావొచ్చు.