ఖుషి లాంటి సినిమాలతో యువతరం హృదయాల్ని దోచుకుంది భూమిక. కమర్షియల్ సినిమాలు చేసినా పద్ధతిగానే కనిపించింది. ఆ తరవాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. నిర్మాతగానూ మారింది. కొంత బ్రేక్ తీసుకుని, ఇప్పుడు మళ్లీ వెండి తెరపై మెరుస్తోంది. నాని సినిమా – ఎంసీఏలో కీలక పాత్ర పోషించింది భూమిక. రూలర్లోనూ నటించింది. ఇప్పుడామె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. త్వరలోనే నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది.
”నాకు నెగిటీవ్ టచ్ ఉన్న పాత్రలంటే చాలా ఇష్టం. ‘మిస్సమ్మ’లో నా పాత్ర అలానే సాగుతుంది. కానీ.. చివర్లో కథంతా మారిపోతుంది. ఈసారి అలా కాదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ నెగిటీవ్ టచ్‌లోనే నా పాత్ర సాగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే అది లేడీ విలన్ పాత్ర. అయితే ఆ సినిమా పేరేమిటో ఇప్పుడే చెప్పను. అంతా ఓకే అయ్యాక తెలియపరుస్తా” అంటోంది. ఇది ఓ స్టార్ హీరో సినిమానే అని సమాచారం. అయితే ఆ హీరో ఎవరో, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది సస్పెన్స్. ఏదేమైనా భూమిక కోరిక మాత్రం ఈసినిమాతో తీరబోతోంది.