ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు పోలీసులు భద్రత పెంచారు. తనకు.. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. ఆయన కేంద్రానికి రాసినట్లుగా చెబుతున్న లేఖపై.. వాదోపవాదాలు జరుగుతూండగానే.. ఆయనకు పోలీసులు భద్రత పెంచారు. ఇప్పటి వరకూ వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఆయనకు ఉండేది. ఈ ఉదయం నుంచి ఫోర్ ప్లస్ ఫోర్‌కి పెంచారు. కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ రాసిన లేఖ చేరిందన్న సమాచారాన్ని వైసీపీ నేతలే ప్రకటించారు. అయితే.. ఆ లేఖ రమేష్ కుమార్ రాసింది కాదన్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం కూడా.. ఈ లేఖపై వెంటనే స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు రావడంతోనే.. ఉన్న పళంగా ఆయనకు ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీని కల్పించమని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
అయితే.. రమేష్ కుమార్ కేంద్ర బలగాల రక్షణ కోరారు. తాను హైదరాబాద్‌లో ఉండేలా అనుమతించాలని కోరారు. ఇప్పటికిప్పుడు రక్షణ కోసం.. రాష్ట్ర పోలీసుల్ని కేటాయించినా.. రేపోమాపో ఆయనకు కేంద్ర బలగాల రక్షణ కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇప్పటికే ఈ మేరకు.. అమిత్ షాకు ఓ లేఖ రాశారు. ఎన్‌ఈసీకి కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలో రమేష్ కుమార్ భద్రత పెంపు.. హాట్ టాపిక్ అవుతోంది. మరో వైపు రమేష్ కుమార్ రాసిన లేఖపై వైసీపీ నేతలు.. ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. ఆ లేఖ ఫేక్ అయితే.. ఎన్ఈసీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు తయారు చేయించారని ఒకరు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మరికొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ఈసీ రాసిన లేఖ పరిణామాలపై.. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటలిజెన్స్ చీఫ్ మనిష్ కుమార్‌లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఆ లేఖ రమేష్ కుమారే రాసి ఉంటారని.. అందుకే.. అధికారికంగా ఖండించడం లేదన్న అభిప్రాయానికి వైసీపీ వచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తిగా చూస్తున్నారు.