మానవాళికి ముప్పులా మారిన కరోనాపై విజయం సాధించాలంటే.. జనతా కర్ఫ్యూనే మార్గమని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న కరోనాపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మానవ జాతిని కరోనా సంక్షోభంలోకి నెట్టిందన్నారు.
కరోనా వైరస్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోందని .. మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు వచ్చాయన్నారు. వచ్చే కొద్ది రోజుల పాటు మీ సమయాన్ని తనకు ఇవ్వమని మోదీ కోరారు. ఇప్పటి వరకు కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదని .. ఎన్నో పరిశోధనలు చేసినా వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారన్నారు. కరోనాను తేలిగ్గా తీసుకోలేమని.. అందరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎదుర్కోగలమన్న నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది … కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి కన్నా ప్రతి పౌరుడి సంకల్పబలం ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు.
సామాజికంగా కట్టుబాట్లు పాటించాలని.. గుంపులకు దూరంగా ఉండాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మీకు అనారోగ్యంగా ఉన్నా, కరోనా లక్షణాలు ఉన్నా.. జనంలో తిరుగుతున్నారంటే మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నట్లేనని.. మీ కుటుంబానికి, సమాజానికి అన్యాయం చేస్తున్నట్లేనని మోడీ గుర్తు చేశారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లు వచ్చే కొన్ని వారాలు.. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలని.. ఉద్యోగమైనా, బిజినెస్ అయినా ఇంటి నుంచే చేసుకోమని సలహా ఇచ్చారు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలే కరోనా బారిన పడ్డాయి.. అలాంటిది మనదేశం అతీతం కాదని స్పష్టం చేశారు.
సాధ్యమైనంత వరకు హాస్పిటల్‌కు వెళ్లే పని పెట్టుకోకండి .. మీకు తెలిసిన డాక్టర్‌ను ఫోన్లో సంప్రదించి సలహాలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోందని… దీని కోసం టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశామన్నారు. ఆర్థికంగా కలుగుతున్న కష్టనష్టాల నుంచి గట్టెక్కించడం ఎలా అనేది ఈ టాస్క్‌ఫోర్స్ చూసుకుంటుందన్నారు. మన సన్నిహితులు, స్నేహితులు, హితుల ఆర్థిక పరిస్థితిని సానుకూల దృక్పధంతో అర్థం చేసుకోవాలి, అండగా నిలబడాలి.. పరస్పర సహకారంతోనే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోగలమని ప్రజలకు ధైర్యం చెప్పారు మోడీ.