ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లు, స్కూళ్లను తెలంగాణ సర్కారు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వస్తున్నవారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి, హోమ్ క్వారంటైన్ సూచిస్తున్నారు. వీటితోపాటు, మరిన్ని చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరోనా నియంత్రణపై ఆయన సమీక్షించారు. వేరే విమానాశ్రయాలు, ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రవాణా మార్గాల ద్వారా మన రాష్ట్రంలోకి కొందరు వస్తున్నారనీ, దాన్ని కట్టడి చేయడం కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. కరీంనగర్లో మత ప్రచారానికి అలానే వచ్చారనీ, వారిని గుర్తించి ఇప్పుడు చికిత్స ఇస్తున్నామన్నారు.
కరీంనగర్ ఘటన దృష్టిలో పెట్టుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లకీ ఆదేశాలు జారీ చేశామనీ, రాబోయే మూడు రోజుల్లో… ఆయా జిల్లాల్లో, మార్చి 1 నుంచి విదేశాల నుంచి వచ్చినవారిని వెంటనే గుర్తించాలని చెప్పామన్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించిన దేశాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయనీ, ఎవరైతే కఠిన చర్యలు తీసుకున్నారో వాళ్లకి బాధ లేదన్నారు. మనం కూడా కఠినంగా ఉందామన్నారు. గతంలో వారంపాటు బంద్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన సినిమా హాళ్లు, బార్లు, పబ్ లు, అమ్యూజ్మెంట్ పార్కులు… ఇలాంటివన్నీ మార్చి 31 వరకూ మూసివేతను కొనసాగిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులతోపాటు ఇతర ప్రార్థనామందిరాల్లో భక్తులను అనుతించొద్దు అంటూ ఆయా యాజమాన్యాలను కోరినట్టు కేసీఆర్ అన్నారు. 25న ఉగాది వేడుకల్ని కూడా ప్రభుత్వం రద్దు చేస్తోందనీ, పంచాగ శ్రవణం లైవ్ టెలీకాస్ట్ చేస్తామన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను కూడా రద్దు చేశామన్నారు.
పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు కూడా వచ్చి పోతుంటాయనీ, సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గడ్, ఏపీలతో సరిహద్దులున్నాయనీ, 18 చెక్ పోస్టులు ఓపెన్ చేస్తున్నామనీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను చెక్ చేస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చినవారికి హోమ్ క్వారంటైన్ చేస్తామన్నారు. మనరాష్ట్రంలో గుర్తించిన కరోనా కేసుల్లో ప్రతీ ఒక్కరూ బయట్నుంచి వచ్చినవారేననీ, ఇక్కడున్నవారు ఒక్కరికీ కాలేదనీ, రావొద్దని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. సీఎం కేసీఆర్ లో మెచ్చుకోదగ్గ లక్షణమే ఇది! కొద్దిరోజుల కిందట కరోనా గురించి పెద్దగా పట్టించుకోనట్టు మాట్లాడారు. కానీ, తప్పదు అనుకునేసరికి… బేషజాలను పక్కనపెట్టి, అన్ని రాష్ట్రాలకంటే వేగంగా, కఠినంగా, సమర్థంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు.