చాదస్తపు మొగడు చెబితే వినడు.. కొడితే ఏడుస్తాడు..!.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరోనా వైరస్ ప్రభావాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి రమేష్ కుమార్.. నామినేషన్ల దశలో ఉన్న స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి వేసిన చిందులు అన్నీ ఇన్నీ కావు. నిజానికి అప్పటికే కరోనా ప్రభావం.. దేశ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు.. క్వారంటైన్ తరహా నిర్ణయాలు తీసుకుని… ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గుంపులుగా ఎక్కడికి వెళ్లవద్దని చెబుతున్నాయి. ఐటీ సంస్థలు సహా.. అన్నింటినీ అప్రమత్తం చేసేశారు. పరిస్థితి ఎలా ఉందంటే.. ఏ నగరంలో చూసినా కర్ఫ్యూ ప్రకటించారేమో అన్నట్లుగా ఎవరూ రోడ్ల మీదకు కూడా రావడం లేదు. ఇలాంటి అప్రకటిత కర్ఫ్యూ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అమలవుతూంటే.. ఏపీలో మాత్రం.. ప్రజారోగ్యంపై ఎలాంటి పట్టింపులు లేకుండా ఎన్నికల నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చివరికి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్..తన అధికాలతో ఎన్నికలు వాయిదా వేస్తే.. దానికి సీఎం చేసిన రచ్చ ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు.
ఈసీ అధికారాలను ప్రశ్నించే సీఎంను మొదటి సారి చూస్తున్నాం..!
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ … ఎన్నికల వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన పనిలేదు. అసలు అలాంటి ఆలోచన రావడం.. సంప్రదించాలని కోరుకోవడం అంటే.. రాజ్యాంగంపై కనీస అవగాహన లేనట్లే. ఎందుకంటే.. ఒక్క సారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషనరే సర్వాధికారి. ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి తెలిసి అన్నారో.. తెలియక అన్నారో కానీ.. ముఖ్యమంత్రి తానా..?రమేష్ కుమారా..? ప్రశ్నించారు. ఆయన ఆ ప్రశ్న వేసే సమయానికి ముఖ్యమంత్రి ఆయనే కానీ.. అధికారాల పరంగా నిమిత్తమాత్రుడు. పూర్తి అధికారాలు రాజ్యాంగ పరంగా.. ఎన్నికలు ముగిసేవరకూ రమేష్కుమార్కే ఉంటాయి. ఆ విషయం తెలియదో.. తెలిసి కూడా అలా మాట్లాడారో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. తను అనుభవించాల్సిన అధికారాలను.. ఆయన అనుభవిస్తున్నారని అనుకున్నారో.. లేక ఎన్నికలను వాయిదా వేశారని కోపమో కానీ…కులం పేరుతో కించపరిచేశారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి..రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిని కులం పేరుతో కించపరచడం అనేది స్వతంత్ర భారతంలోఇదే మొదటి సారి. ఆ రికార్డు జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ముఖ్యమంత్రి నిందించిన సామాజికవర్గానికి చట్టపరంగా అట్రాసిటీ చట్టాల్లాంటి రక్షణలేమీ లేవు కాబట్టి.. భరించాల్సిందే. ముఖ్యమంత్రి ఈ తరహా వ్యాఖ్యలకు దిగి.. ఆ సామాజికవర్గం వ్యక్తులు ఏ పనులు.. వ్యాపారాలు చేయకూడదన్నట్లుగా వ్యవహరిస్తే.. వారు కూడా .. తమపై జరుగుతున్న వేధింపుపై ఓ చట్టం కోసం ఉద్యమాలకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
కుటుంబాలు, కూతుళ్లనీ టార్గెట్ చేయడం ఏ తరహా రాజకీయం..!
ప్రెస్మీట్లో ఓ రాజ్యాంగబద్ధమైన .. స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అధిపతిని.. అదీ కూడా తన కంటే వయసులో ఎంతో పెద్ద అయిన గౌరవనీయమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఏక వచనంతో.. సంబోధించి.. కులపక్ష పాతం అంటగట్టడమే కాదు.. తన పార్టీ నేతలకూ.. అంత కంటే ఘాటుగా విమర్శలు ఉండాలని సంకేతం పంపారు. చివరికి మరో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీలో స్పీకర్‌తోనూ వ్యక్తిగతంగా విమర్శించేలా చేశారు. కొంత మంది నేతలు అయితే.. దాడులు చేస్తామన్నట్లుగా హెచ్చరికలు చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే… రమేష్ కుమార్ .. కుమార్తెను..సోషల్ మీడియాలోకి తెచ్చారు వైసీపీ నేతలు. ఆయన కుమార్తె గత ప్రభుత్వంలో ఏపీఈడీబీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మంచి పనితీరు కబరిచారు. పరిశ్రమలను ఆకర్షించే విషయంలో ఆమె కృషిని చాలా మంది మెచ్చుకున్నారు కూడా. కానీ.. ఆమెను సోషల్ మీడియాలోకి తెచ్చి రచ్చచేశారు..వైసీపీ నేతలు. ఈ పరిణామాలన్నింటితో విసిగిపోయిన రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసేశారు. ఎన్నికలు నిర్వహించాలంటూ..సీఎస్ తనకు రాసిన లేఖ తన కంటే ముందు మీడియాలో రావడంతో.. ఇదందా పొలిటికల్ గేమ్ అని అర్థం చేసుకున్న ఆయన… తర్వాత సీఎస్‌కు లేఖ రాసి.. అలాగే మీడియాకు విడుదల చేశారు. హోంశాఖ కు రాసిన లేఖను కూడా.. ఏదో కోణంలో హైలెట్ అయ్యేలా చూసుకుని టిట్ ఫర్ టాట్ అని సమాధానం ఇచ్చారని మనం అనుకోవచ్చు. ఎంతైనా ఏడేళ్ల పాటు.. ఉమ్మడి రాష్ట్రాన్ని.. అలాగే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల్ని శాసించిన గవర్నర్ వద్ద పని చేసిన అనుభవం కదా..!
జగన్ కన్నా రోజా బెటర్..! ఆలోచన ఉన్న నేతలు పైకి అయినా సమర్థించేవారు..!
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ అని.. వాయిదా నిర్ణయం వెలువడి వెంటనే.. ఆయన గవర్నర్ ని కలవడం… వెంటనే ప్రెస్‌మీట్ పెట్టడం… ఆ తర్వాతి రోజే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. వంటి పరిణామాలను బట్టి చూస్తే అర్థమైపోతుంది. ఎన్నికల ప్రకియ గురించి.. జడ్పిటీసీకి పోటీ చేసేవారికి కూడా అవగాహన ఉంటుంది. ఈసీ నిర్ణయాల్లో ఎవరూ జోక్యం చేసుకోలేరని.. పదో తరగతి ప్రజాస్వామ్య పాఠాల్లోనే ఉంటుంది. కానీ జగన్ మాత్రం.. అలాంటివి పట్టించుకోుకుండా తీసి పడేశారు. అడ్వకేట్ జనరల్ ను తీసుకుని గవర్నర్ వద్దకెళ్లిపోయారు. అయనేమీ చేయలేరని తేలిన తర్వాత సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టులోనూ అదే తీర్పు వచ్చింది. కోడ్ ఎత్తివేయడం ఒక్కటే ఊరట. కానీ ఆ తీర్పునూ తమకు అనుకూలంగా చెప్పుకుని ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. జరుగుతున్న డ్యామేజ్ ము మాత్రం గుర్తించలేకపోతున్నారు. నిజానికి ప్రభుత్వంతో ఎస్ఈసీ సంప్రదించకపోయినా.. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు.. ప్రభుత్వం.. తామే వాయిదా వేయించామన్నట్లుగా కవరింగ్ చేసుకుని క్రెడిట్ పొందడానికి ప్రయత్నం చేయడమే… కాస్త తెలివైన రాజకీయ నేతలు చేసే పని. వైసీపీలో ..ఇలాంటి నేతలు ఉన్నారు. రోజా సహా.. చాలా మంది.. కరోనా కారణంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఎన్నికల్ని వాయిదా వేశామని ముందుగానే ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తెలిసిన తర్వాత వారంతా మాట మార్చక తప్పలేదు.
అర్థం లేని ఆవేశంతో ఎస్ఈసీని వ్యతిరేకం చేసుకున్న జగన్ అండ్ కో..!
సాధారణంగా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు.. ప్రభుత్వాలతో గొడవలు ఎందుకని.. రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లోనే పని చేస్తూంటారు. ఇప్పటి వరకూ… జరిగింది అదే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ను వైసీపీకి ఇచ్చి.. వారి కనుసన్నల్లోనే ఎన్నికలు పూర్తి చేద్దామనుకున్నారు. ఎన్నికల రద్దు నిర్ణయం ప్రకటించే ముందు రోజు వరకూ.. టీడీపీ నేతల ఫిర్యాదులనూ ఆయన బుట్టదాఖలు చేసారు. కానీ అధికార పార్టీ అత్యాశకు పోవడంతో ఉన్నది కూడా పోయినట్లుగా అయిపోయింది. దాడులు, దౌర్జన్యాలతో నామినేషన్లు వేయనివ్వకుండా.. వేసినా.. రిజెక్ట్ చేసేలా చేసి.. ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేశారు. చివరికి మాచర్లలో పట్టపగలు.. ఇద్దరు ప్రముఖ నేతలపై హత్యాయత్నం జరిగితే.. నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేంత స్థాయికి దిగిజారిపోయారు. ఈ పరిణామాలన్నింటితో రమేష్ కుమార్ కు.. తాను మరీ ఎక్కువ అడ్వాంటేజ్ ఇచ్చి… తన కెరీర్ చరమాంకంలో చెరపలేని మరక వేసుకుంటున్నానని భావించేలా చేశారు. దాంతో ఆయన రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయనకు ఢిల్లీ సపోర్టు కూడా కలిసి వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
రాజకీయాల్లో ఆవేశం కాదు.. ఆలోచన ముఖ్యం..!
ఈ మొత్తం వ్యవహారం చూస్తే..సింపుల్‌గా చేసుకోవాల్సిన పనిని చినిగి చేటంత చేసుకున్న వైనం స్పష్టం గా కనిపిస్తోంది. పోనీ ఇంత చేసిన తర్వాత ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. ఒక వేళ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలు వాయిదా వేయకపోయినా… ఇప్పుడు ప్రభుత్వం వాయిదా వేసి ఉండేది. వేయకపోతే.. కేంద్రమే హెచ్చరించి మరీ వాయిదా వేసి ఉండేది. నిన్నటి ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత తేలింది అదే. ఇంతోటి దాన్ని.. ఏపీ శాంతిభద్రతల అంశాని ఇప్పుడు.. కేంద్ర హోంశాఖ పరిధిలోకి చేరుకునేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర బలగాలతో.. ఎస్ఈసీకి భద్రత కల్పించడమే దీనికి సంకేతం. అందుకే.. రాజకీయంలో ఆవేశం పనికి రాదు.. ఆలోచన ఉండాలి అంటారు. అలాంటిది లేనప్పుడు… వైసీపీ అధినేతలా.. ఇరుక్కుపోతూనే ఉంటారు. అందుకే చెబితే వినరు..కొడితే ఏడుస్తారని చెప్పాల్సి వస్తోంది.