ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను.. కేంద్ర ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకుంది. ఉన్న పళంగా రాత్రికి రాత్రే ఆయనకు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన కేంద్రం.. దానికి సంబంధించి తదుపరి ఆదేశాలు అధికారికంగా ఏ క్షణమైనా జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి కేంద్ర బలగాలు కావాలని.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో సహకరించలేదని.. తీవ్రమైన ఆరోపణలను లేఖలో నిమ్మగడ్డ ప్రసాద్ చేశారు. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా.. సీఎస్‌తో పాటు డీజీపీ, సీఎంవో అధికారులను పిలిపించి వివరాలు తీసుకున్నారు. విపక్ష పార్టీల నుంచి కూడా.. వారి తరపున వివరాలు ఆధారాలు సేకరించారు. వీటన్నింటినీ కలిపి ఆయన కూడా.. కేంద్రానికి ఓ నివేదిక పంపనున్నట్లుగా తెలుస్తోంది.
రమేష్ కుమార్ రాసిన లేఖ.. ఆయన రాసింది కాదంటూ.. వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. వారికి చెందిన అనుకూల మీడియాలో అది ఫేక్ అని.. టీడీపీ నేతల సృష్టి అని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇది.. తప్పు అని.. అది నిజమైన లెటర్ అని.. రమేష్‌కుమార్‌కు.. సీఆర్పీఎఫ్ భద్రత కల్పించడంతోనే తేలిపోయింది. అయితే.. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో… కొంత మంది సందేహంలోనే ఉన్నారు. దీన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తొలగించేశారు. తమకు ఎస్ఈసీ నుంచి లేఖ అందిందని స్పష్టం చేశారు. తమకు లేఖ అందిన వెంటనే… ఏపీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడామని.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని స్పష్టం చేశారు. వాటికి సంబంధించి లిఖిత పూర్వక ఆదేశాలు రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించారు.
అధికారులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదని స్పష్టం చేశారు. ఏ అధికారులను అయినా బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రమేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో రక్షణలోనే ఉన్నారని.. ఏపీ వెళ్తే పూర్తి రక్షణ కల్పించాలని సీఎస్‌కు చెప్పామన్నారు. కిషన్ రెడ్డి స్పందనతో.. ఏపీలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఖాయమని తేలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఎన్నికల ప్రక్రియ ఏమైనా జరగాల్సి ఉంటే.. అది కూడా … నిమ్మగడ్డ కోరినట్లగా కేంద్ర బలగాల పరిధిలో జరుగుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఆ లెటర్‌ను ఫేక్ అని చెప్పడానికి విశ్వప్రయత్నం చేసిన.. వైసీపీ.. వారి అనుకూల మీడియా… కిషన్ రెడ్డి స్పందనతో.. సైలెంటయిపోయినట్లయింది.