రివర్స్ ఎఫెక్ట్ ఏపీ సర్కార్‌కు గట్టిగానే తగులుతోంది. ఎన్నికల కోడ్ పేరుతో ఇళ్ల స్థలాల పంపిణీని ఎన్నికల కమిషన్ అడ్డుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేసిన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినప్పటికీ.. ఇళ్ల స్థలాల పంపిణీని వాయిదా వేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ.. నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త పథకాల విషయంలో మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాలని తెలిపింది. దీంతో.. ఏపీ రెవిన్యూ శాఖ నుంచి ఎస్‌ఈసీ కార్యాలయానికి .. ఇళ్ల స్థలాల పంపిణీకి అనుమతించాలంటూ.. ఓ లేఖ వెళ్లింది. దానికి వెంటనే ఎస్‌ఈసీ అనుమతి ఇచ్చారు. ఇలా అనుమతి వచ్చిన కాసేపటికే ప్రభుత్వం.. ఇళ్ల స్థలాల పంపిణినీ కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.
ఉగాదిన జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ ఏప్రిల్ 14న జరుగుతుందని ప్రకటన చేసింది. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఓ వైపు .. ఏపీలో కరోనా ఎఫెక్ట్ లేదని.. మరో నాలుగు వారాల పాటు.. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవని.. ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ రాసిన మూడు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. రాష్ట్రం మొత్తం జనం గుమికూడే కార్యక్రమాలన్నింటినీ ఎక్కడివక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు .. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి… మేనిఫెస్టోలో కూడా పెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీని కూడా నిలిపి వేయాల్సి వచ్చింది.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం ఎదురు తిరుగుతోందనడానికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదానే ఓ నిదర్శనం అన్నట్లుగా మారిపోయింది. మొదట్లో ఇళ్ల పట్టాల పంపిణీని ఈసీ అడ్డుకున్నా.. చేస్తామని … తొడకొట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు… ఈసీ అనుమతి ఇచ్చినా కూడా.. వాయిదా వేయడంతో.. లబ్దిదారులకు ఏం చెప్పుకోవాలో తెలియక ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.