హైదరాబాద్ నుంచి పని చేసేందుకు అనుమతించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ..రెండో రోజే.. హైదరాబాద్ నుంచి పని ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఆఫీసు నుంచే ఇక పని చేయబోతున్నట్లుగా ఓ ప్రకటన మీడియాకు విడుదల చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీకి అనుమతించాలంటూ.. ఏపీ సర్కార్ పెట్టుకున్న దరఖాస్తుకు.. ఆమోదం తెలుపుతూ సంతకం పెడుతున్న ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. అయితే.. మీడియాకు విడుదల చేసిన ప్రకటనల్లో మాత్రం… హైదరాబాద్ నుంచి పని చేయడానికి కారణం.. లేఖలో పేర్కొన్నట్లుగా భద్రతా పరమైన విషయాలను పేర్కొనలేదు.
కరోనా కారణంగా.. సామాజిక బాధ్యతగా… ఈ వర్క్ ఫ్రం హైదరాబాద్ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలిపారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ సర్కార్ పెద్దల నుంచి బెదిరింపులు రావడంతో.. రక్షణ కోసం ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. వెంటనే గంటల్లోనే ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాల రక్షణ కల్పించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పని చేసేందుకు కూడా అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం నుంచే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన విధులను హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్నారు. అయితే.. పెద్దగా వివాదం లేకుండా… కరోనా కారణం అని మీడియాకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తిగల ఎన్నికల కమిషన్ వంటి అధికాపతులకు సైతం.. బెదిరింపులు రావడాన్ని.. ముఖ్యమంత్రి సహా. మంత్రులు అందరూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే రమేష్ కుమార్ కు.. తక్షణం భద్రత కల్పించడంతో పాటు హైదరాబాద్ నుంచి పని చేసే అవకాశాన్ని కూడా కల్పించారని అంటున్నారు. తర్వాత కూడా రమేష్ కుమార్… స్థానిక ఎన్నిక ప్రక్రియను ఇక హైదరాబాద్ నుంచే పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.