హైదరాబాద్: సంచలనం సృష్టించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చివరి అంకం… మేయర్ ఎన్నిక రేపు జరుగనుంది. కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాలును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కొత్త కుర్చీలను, మైకులు, లైట్లు, ఏసీని సిద్ధం చేశారు. 150 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు 67 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు మేయర్ ఎన్నికలో పాల్గొంటారు. మొత్తం ఎన్నికలో పాల్గొనే సభ్యుల సంఖ్య 217 కావటంతో మేయర్ ఎన్నికకోసం 108 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే 99 మంది సభ్యులు గెలుచుకోవటం, గణనీయ సంఖ్యలో ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉండటంతో ఆ పార్టీ వారే నామినేటెడ్ పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవనున్నారు. మొన్నటివరకు ఎక్స్ అఫిషియో సభ్యులు కలుపుకుని టీఆర్ఎస్ బలం 133 కాగా, నిన్న టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చేరటంతో గులాబీ బలం 134కు పెరిగింది.
టీఆర్ఎస్లో మేయర్ పదవికి కేశవరావు కుమార్తె విజయలక్ష్మికి, కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరుపడ్డ బొంతు రామ్మోహన్‌కు మధ్య ప్రస్తుతం పోటీ నెలకొని ఉంది. వీరిద్దరు మున్నూరు కాపు సామాజికవర్గం వారే కావటం విశేషం. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేరు కాబట్టి మేయర్ పదవినైనా మహిళకు ఇస్తే ఆ లోటును భర్తీచేసినట్లుందని కేసీఆర్ భావిస్తున్నట్లు ఒక వాదన వినిపిస్తోంది. అయితే 26 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చిన విజయలక్ష్మికి పౌరసత్వానికి సంబంధించి కొద్దిగా సమస్య ఉందంటున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవిని ఇద్దరికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. వీటిలో ఒక పదవిని ముస్లిమ్‌లకు, మరొకదానిని సీమాంధ్ర వాసులకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.