తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీరియస్ అయ్యారు. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనాపై మంత్రులందరూ సీరియస్ గా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. “మీ శాఖల పనితీరుపై సమీక్షలు నిలిపివేయండి. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు మీ జిల్లాలో పర్యటనలు చేయండి. మీ ఇళ్ళలోనూ, కార్యాలయాల్లోనూ కూర్చుని ఆదేశాలు ఇవ్వకండి” అని మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ సూచనలు చేశారు. తెలంగాణలో కరోనా వైరస్ సోకిందంటూ రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీరిలో తక్కువ మందికే పాజిటివ్ అని వచ్చినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రమే కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షిస్తే సరిపోదని, మిగిలిన మంత్రులందరూ ఈ వైరస్ అదుపులోకి వచ్చేవరకూ దీనిపైనే పనిచేయాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ మినహా మిగిలిన మంత్రులు ఎవరూ ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఎటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించ లేదు. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. “ మీ శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి కరోనా వైరస్ కట్టడిపై చర్యలు తీసుకోవాలి. నేనూ, మంత్రి ఈటల రాజేందర్ మాత్రమే పని చేస్తే సరిపోదు. మీరు కూడా దీనిపై శ్రమించాలి” అని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో కలిసి కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని, మాస్కులు అందజేయడంతో పాటు ఇతర జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజలను సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కరోనా వైరస్ పై ఏ మంత్రి ఎలా పని చేశారనే అంశం కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.