కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేసీఆర్ సర్కారు. రోజురోజుకీ కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. నిర్ధారిత కేసుల సంఖ్య కూడా మెల్లగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో మరింత ముందుచూపుతో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం, చికిత్సలు అందించడంలో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఒకవేళ పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా మారితే… అప్పుడు వైద్యుల సంఖ్య కచ్చితంగా సరిపోదు. కాబట్టి, ఆ ముందుచూపుతోనే వైద్యులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దీన్లో భాగంగా గడచిన ఐదేళ్లలో రిటైర్ అయిన ప్రభుత్వ వైద్యుల జాబితాను సిద్ధం చెయ్యాలని, వారిని మూడు నెలలపాటు కాంట్రాక్ట్ పద్ధతిన వైద్య సేవలు అందించేందుకు విధుల్లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. అవసరమైతే మూడు నెలల తరువాత కూడా వారి పొడిగించాల్సి రావొచ్చనీ చెబుతున్నారు. గడచిన ఐదేళ్లలో రిటైరైన నర్సులను కూడా పెద్ద సంఖ్యలో మూడు నెలలపాటు విధుల్లోకి తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం విధుల్లో సిబ్బంది మొత్తాన్ని కరోనాకు ట్రీట్మెంట్ చేసేందుకు ఫార్వర్డ్ చేశారు. అయితే, కరోనాకు చికిత్స అందించేందుకు వైద్యుల అవసరం జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఉంది. మేన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఇలా గడచిన ఐదేళ్లలో రిటైర్ అయిన వైద్యులు ఎంతమంది ఉంటారు అనేదే ప్రశ్న? మహా అయితే వందల్లో మాత్రమే ఉంటారు. అందుకే, వారితోపాటు ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన వివిధ సంఘాలతో కూడా ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ ఇంతకుముందే చర్చలు జరిపారు. అవసరాన్ని బట్టి, ప్రైవేటు ఆసుపత్రుల వార్డులను, అక్కడి సిబ్బందిని కూడా వినియోగించుకోవాల్సి వస్తుందని ముందుగానే స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన అన్ని రకాల వివరాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం తెప్పించుకుని సిద్ధంగా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.