ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా నియమితులయిన తెదేపా సీనియర్ మహిళానేత నన్నపనేని రాజకుమారి బుదవారం ప్రమాణ స్వీకారం చేసారు. విజయవాడలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు, మంత్రులు చిన రాజప్ప, ప్రతిపాటి పుల్లారావు, పీతల సుజాత, ఎంపి రాయపాటి సాంభశివరావు, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేక మంది హాజరయ్యారు.
ఒకానొక సమయంలో తెలుగు దేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నన్నపనేని రాజకుమారికి ఏపిలో తెదేపా మళ్ళీ అధికారంలోకి వచ్చినందున మళ్ళీ పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందని అనుకొన్నారు. కానీ ఇతర పార్టీలలో నుంచి కొత్తగా వచ్చిన చేరినవారికే చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆమెకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. ఆ కారణంగా ఆమె చాలా రోజులుగా పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. బహుశః ఆమెను చల్లబరిచేందుకే రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ నియమించి ఉండవచ్చును. అటువంటి కీలకమయిన పదవిలో నన్నపనేని వంటి అనుభవజ్ఞురాలు ఉండటం వలన పార్టీకి, ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందనే ఆలోచన కూడా ఇమిడి ఉండవచ్చును.