అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును.. ప్రజలంతా ఆచరించారు. ఎవరూ బయటకు రాలేదు. కానీ మీడియా మొత్తం.. జనాలు ఎవరైనా రోడ్లపైకి వచ్చారేమో చూసేందుకు మాత్రం.. రోడ్లపైకి వచ్చింది.ఓ రకంగా మీడియా మొత్తం రోడ్లపై ఉంది. సామాన్య జనాలెవరూ రాలేదు. ఆదివారం కాబట్టి…ఉద్యోగ, వ్యాపార సంస్థలన్నింటినీ మూసేశారు. సహజంగానే పరిస్థితి భయం పుట్టేదిగా ఉండటంతో… ఎవరైనా సరదాగా రోడ్ల మీదకు వద్దామనుకున్నవారు కూడా రాలేదు. పోలీసులు కూడా.. చాలా తక్కువ చోట్ల ఉన్నారు. వారు కూడా.. తమ జాగ్రత్తలు తము తీసుకున్నారు. అందరూ స్వచ్చందంగా జనతా కర్ఫ్యూని పాటించారు… కానీ మీడియా మాత్రమే ఉల్లంఘించింది.
ఆ చానల్ .. ఈ చానల్ అనే తేడా లేకుండా మీడియా ప్రతినిధులు.. మొత్తం ఉదయం నుంచే రోడ్ల మీదకు వెళ్లారు. ఆరు గంటల కన్నా ముందే.. ఎక్కడైనా రోజ్లపై నలుగురు ఐదుగురు జనం కనిపిస్తే.. ప్రజల్లో భయం అనేది కనిపించడం లేదంటూ… లైవ్ లు ఇచ్చారు. ఏడు గంటల తర్వాత ఒక్కరూ రోడ్లపై కనిపించకపోతే.. ప్రజలంతా.. జనతా కర్ఫ్యూకు సహకరిస్తున్నారని చెప్పారు. అయితే.. తాము మాత్రమే.. కర్ఫ్యూకు సహకరించడం లేదనే విషయాన్ని మాత్రం వారు గుర్తించలేకపోయారు. మీడియా అంటే.. రిపోర్టింగ్ చేయడమే తమ బాధ్యత అనుకుంటున్నారు. ఎక్కడా ఏమీ తెరవలేదని చెప్పడం.. కర్ఫ్యూ వల్ల అంతా నిర్మానుష్యంగా ఉందని చెప్పడం మీడియా బాధ్యత కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటిని ముందుగా మీడియా ఆచరించి చూపాలి.. ఆ తర్వాతే జనం పాటిస్తారు.
కరోనా విషయంలో కూడా… మీడియా టీఆర్పిలో కోసమే వెంట పడుతున్నట్లుగా కనిపిస్తోంది. వారు సామాజిక బాధ్యత పాటించాల్సి ఉంది. వారేమీ కరోనా వైరస్‌కు అతీతులు కాదు. పైగా వారు అన్ని చోట్లకు తిరుగుతూంటారు. ఏ ఒక్క మీడియా ప్రతినిధి కూడా.. ఈ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సూచనలు కూడా లేవు. మొత్తానికి జనతా కర్ఫ్యూని విజయవంతం చేయాలని.. ప్రచారం చేసి.. చివరికి మీడియా మాత్రం పాటించలేదు. చెప్పడానికే నీతులున్నాయేమోనని మీడియాను చూసి మరోసారి అర్థం చేసుకోవచ్చు.