కరోనా వైరస్‌కు పారాసిటమాల్ మందు అంటూ.. కొంత మంది వస్తృతంగా చేస్తున్న ప్రచారం.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడటంతో..కేంద్రం స్పందించింది. కరోనా వైరస్‌కు పారాసిటమాల్ కానే కాదని.. అలాంటి ప్రచారాలన్ని ఫేక్ అని ఒక్క మాటతో .. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ప్రజలు ఎవరూ దాన్ని నమ్మవద్దని కోరింది. మొదట తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి..కరోనాకు .. పారాసిటమాల్ టాబ్లెటే మందు అని ప్రకటించారు. కేసీఆర్ ఒక్క రోజులోనే..అసెంబ్లీలోనే.. తన మాటలు కేవలం ప్రజలకు ధైర్యం చెప్పడానికేనని ప్రకటించి.. కరోనా కట్టడిపై తీవ్ర చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అయితే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం… పారాసిటమాల్ ను సీరియస్‌గా తీసుకున్నారు. పారాసిటమాల్‌తో తగ్గిపోయే వైరస్ కోసం… ఎన్నికలు వాయిదా వేయడం ఎందుకనే వాదన వినిపించారు.
తమ ముఖ్యమంత్రి అలా అన్నారన్న.. కారణం ఏమో కానీ.. జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా మొత్తం.. పారాసిటమాల్ మాత్రమే కరోనాకు మందు అన్న ప్రచారం చేసింది. గతంలో.. కరోనాకు వైద్యం చేసిన బృందాలు.. తాము ఎలా వైద్యం చేశామో వివరిస్తూ… పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా వాడామని చెబుతూ వచ్చిన.. కొన్ని పాయింట్లను తీసుకుని.. అది ఒక్కటి వాడటం వల్లనే… వైరస్ చనిపోయిందనే ప్రచారాన్ని ప్రారంభించారు. సాక్షి మీడియా ఓ అడుగు ముందుకేసింది. లేని పోని అన్వయింపులతో… కేరళ వైద్యులు చెప్పినట్లుగా పారాసిటమాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. చివరికి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహిత అధికారి పీవీ రమేష్ కూడా.. పారాసిటమాల్ వాదనే వినిపించారు.
ఈ పారాసిటమాల్ ఫార్ములాను కాన్ఫిడెంట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కొంత మంది చేస్తూండటంతో.. కేంద్రం.. స్వచ్చందంగా స్పందించింది. అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దని… పారాసిటమాల్ పై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేసింది. కేసీఆర్ తన పారాసిటమాల్ వ్యాఖ్యలపై ఎప్పుడో వివరణ ఇచ్చారు. దాని గురించి మాట్లాడటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పారన్న విషయాన్ని పట్టుకుని అది నిజమేనని నమ్మించేందుకు వైసీపీ నేతలు.. జగన్ మీడియా.. వారి సోషల్ మీడియా టీం.. విపరీతంగా ప్రయత్నిస్తూండటమే కలకలం రేపుతోంది.