మార్చి నెలాఖరు వరకూ తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదివారం నాడు చూపించిన స్ఫూర్తితోనే నెలాఖరు వరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. నిత్యావసరాల సరకులు, కూరగాయల కోసం కుటుంబానికి ఒకరు చొప్పునే బయటకి రావాలన్నారు. ఐదుగురికి మించి ఎవ్వరూ గుమిగూడి ఉండొద్దనీ, ఒకవేళ ఎవర్నైనా కలవాల్సి వచ్చినా కనీసం మూడు అడుగుల దూరాన్ని పాటించాలన్నారు. ఈ విపత్కర సమయంలో మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. దురదృష్టవశాత్తూ మరో ఐదు పాజిటివ్ కేసులు ఇవాళ్ల వచ్చాయన్నారు. ఈ ఐదుగురూ విదేశాల నుంచి వచ్చినవారే అన్నారు.
తెల్లకార్డు ఉన్నవారికి వ్యక్తికి 12 కేజీల చొప్పున రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామన్నారు. పేదలు సరుకులు కొనుక్కునేందుకు ప్రతీ రేషన్ కార్డుకీ రూ. 1500 నగదు ఇస్తున్నామన్నారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 100 శాతం డ్యూటీలకు రావాలన్నారు. ఇతర సర్వీసుల్లో 20 శాతం చొప్పున రొటేషన్ చొప్పుడు విధులకు హాజరౌతారన్నారు. అన్ని రకాల విద్యా సంబంధ కార్యక్రమాలు మూసేస్తున్నామని చెప్పారు. ఈ వారం పాటు ఉద్యోగులకు ప్రైవేటు కంపెనీలు కూడా జీతాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది సామాజిక బాధ్యత అన్నారు. వందశాతం ప్రజా రవాణా బంద్ ఉంటుందన్నారు. ట్యాక్సీలు, ఆటోలు అన్నీ బంద్ అన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేస్తున్నామన్నారు. బయట్నుంచీ ఎవ్వర్నీ రానిచ్చేది లేదన్నారు. కానీ, కూరగాయలు, మందులు తెచ్చే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు.
ఈ ప్రయాస అంతా ప్రజలు కొన్నాళ్లపాటు ఇంటికే పరిమితం చెయ్యాలన్నదే అన్నారు ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితులో అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వానికి అందరూ సహకరించాలన్నారు. ఇది పౌర బాధ్యతగా స్వీకరించాలన్నారు. నిజానికి, దేశంలో 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలంటూ కేంద్రం ప్రకటించింది. ఆ జాబితాలో తెలంగాణకు చెందిన ఐదు జిల్లాలు ఉన్నాయి. కానీ, ముందుజాగ్రత్త ద్రుష్ట్యా రాష్ట్రమంతా 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించారు.