సినిమానే మాకు అన్నీ ఇచ్చింది ` అని హీరోలు, దర్శకులు, నిర్మాతలు చెబుతుంటారు. అవును… సినిమా అందరికీ అన్నీ ఇచ్చింది. కేరాఫ్ ఫ్లాట్ ఫామ్ అనుకున్నవాళ్లని స్టార్లు చేసింది. స్వయం కృషిని నమ్ముకున్న వాళ్లకు సింహాసనంలో కూర్చోబెట్టింది. టాలెంట్ ఉంటే చాలు… కనక వర్షం కురిసేలా చేసింది. అందుకే సినిమా తల్లికి అందరూ రుణపడి ఉన్నవాళ్లే. ఇప్పుడు ఇన్నిచ్చిన సినిమాకు, ఎంతో కొంత తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. అవును.. ఇప్పుడు చిత్రరంగానికి స్టార్ల అవసరం వచ్చింది.
గత వారం రోజులుగా.. చిత్రసీమ మూతబడింది. షూటింగులు లేవు. మార్చి 31 వరకూ ఇదే పరిస్థితి. ఆ తరవాత కూడా షూటింగులు ఉంటాయే లేదో చెప్పలేని పరిస్థితి. పది, పదిహేను రోజులు పని లేకపోతే.. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు కావల్సినంత ఖాళీ. కుటుంబంతో సరదాగా గడపొచ్చు. కానీ.. రెక్కాడితే గానీ డొక్కాడని సినీ కార్మికుల పరిస్థితి అలా కాదు కదా? జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బోయ్స్, చిన్నా చితకా వేషాల కోసం ఎదురుచూసే నటీనటులు, ఆఫీసు బాయ్స్… వీళ్ల పరిస్థితి ఇది కాదు కదా..? ఏ రోజు షూటింగ్ లేకపోయినా – ఖాళీ జేబులు,ఆకలి కడుపులే మిగులుతాయి. ఇలాంటి వాళ్ల కన్నీళ్లని తీర్చడం కూడా.. సినీ తల్లికి సేవ చేసినట్టే కదా?
ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ని మెచ్చుకుని తీరాలి. మే వరకూ.. తన సిబ్బందికి ముందస్తుగా వేతనాలు చెల్లించాడు. తన సినిమాకు పనిచేస్తున్న కార్మికులకు పనికి రాకపోయినా జీతం అందించాడు. రాజశేఖర్ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చాడు. రోజువారీ వేతనం కోసం పనిచేసే కార్మికుల్ని ఆదుకోవడానికి సిద్ధమయ్యాడు. అలాంటివాళ్లకు పదిరోజులకు సరిపడే బియ్యం, పప్పు లాంటి నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేయడానికి పూనుకున్నాడు. ఒకరో ఇద్దరో పూర్తి చేయాల్సిన కార్యక్రమం కాదిది. మిగిలిన హీరోలూ ముందుకు రావాలి. `మా` లాంటి సంస్థలు ఇప్పుడే కదా తమ సేవా దృక్పథాన్ని చాటుకోవాల్సింది. ఛాంబర్లు, కౌన్సిళ్లూ, గిల్డ్లూ… లేదా ఇవన్నీ కలిసికట్టుగా పనిచేసి రోజువారీ కార్మికుల ఆకలి బాధలు తీర్చాలి. రాజశేఖర్, ప్రకాష్రాజ్లను చూసైనా – మిగిలినవాళ్లు ముందుకొస్తారేమో చూడాలి.