ఆమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాల పేరుతో పంపిణీ చేయడానికి సిద్ధమైన ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు జారీ చేసిన జీవోపై స్టే విధించింది. గతంలోనే వాదనలు పూర్తయి.. తీర్పు రిజర్వ్ అయిన.. ఈ అంశంలో.. హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మొత్తంగా రాజధాని గ్రామాల్లో 51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై రైతులు.. హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(డి) ప్రకారం.. భూ సమీకరణ కింద సేకరించిన భూమిలో 5 శాతం పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఉపయోగించాలని అందులో నుంచే 1251 ఎకరాలు కేటాయిస్తున్నామని వాదించింది. అయితే.. రాజధాని గ్రామాల్లో ఇళ్లు లేని వారి కోసమే.. ఆ నిబంధన పెట్టారని..బయట వారి కోసం కాదని.. రైతుల తరపు న్యాయవాదులు .. తమ వాదన వినిపించారు.
నిజానికి సీఆర్డీఏ చట్టంలో ఐదు శాతం ప్రాంతాన్ని స్థలాలుగా పంపిణీ చేయాలని లేదు. ఇళ్లు లేని వారికి ఆవాసం కోసం వినియోగించాలని ఉంది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలాంటి వారి కోసం అపార్టుమెంట్లు నిర్మించింది. వాటిని లబ్దిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం.. భూముల్నే పంపిణీ చేయాలని నిర్ణయంచుకుంది. ఇదే అంశాన్ని రైతుల తరపు న్యాయవాదులు కోర్టులో వినిపించారు. గత వాయిదాల్లో విచారణ సందర్భంగా.. హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజదానిలో సీఆర్డీఏ చట్టం ప్రకారం.. అభివృద్ధి పనులు చేపట్టకుండా.. భూములు పంచే అధికారం మీకెక్కడిదని.. ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగానే ప్రశ్నించింది.
తాము రాజధాని కోసమే.. భూములిచ్చామని.. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని రైతుల ుఅంటున్నారు. రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడంపై హైకోర్టు స్టే విధించడంతో.. యాభై వేల మంది లబ్దిదారులకు ఇతర చోట్ల.. ప్రభుత్వం స్థల సేకరణ చేయాల్సి ఉంది. ఉగాది రోజున జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను.. ఇప్పటికే… వచ్చే నెలకు వాయిదా వేశారు.