కథానాయిక అనగానే ఫొటో షూట్లు, షూటింగుల హడావుడి, షాపింగ్ మాల్స్ సందడి… ఇవే ఉంటాయి. లేదంటే మేకప్ విషయాలో, పేకప్ అనంతరం జరిగే సరదా సంగతులో చెప్పడానికి మీడియా ముందుకొస్తారు. ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చినా – సినిమా సంగతులే చెబుతుంటారు.
అయితే కరోనా పుణ్యమా అని సినిమా షూటింగులన్నీ బంద్ అయిపోయాయి. హీరోయిన్లు ఇంటికేపరిమితమయ్యారు. చెప్పుకోవడానికి సినిమా విషయాలేం లేవు. కాబట్టి కాజల్ కొత్త దారిలో వెళ్లింది. ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి వంటా వార్పూ మొదలెట్టింది. ఈరోజు ఉదయం కాజల్ ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి అభిమానులతో చాట్ చేసింది. అయితే ఈసారి చాటింగ్ మాత్రం కాస్త విభిన్నంగా కనిపించింది. కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పూస గుచ్చినట్టు వివరించింది. వంట గదిలో దూరి.. తన పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించింది. ఆమ్లేట్ వేయడంలో కొన్ని చిట్కాల్ని, కొత్త పద్ధతుల్నీ అభిమానులతో పంచుకుంది. ”నేను వంట బాగానే చేస్తాను. కానీ అది ఎలా వుంది అనేది తిన్నవాళ్లే చెప్పాలి. నా వరకూ వంట చేయడం ఓ సరదా. నాకు నచ్చిన పదార్థాల్ని నాకు నేనే వండుకొని తినడం ఇష్టం” అని చెప్పుకొచ్చింది కాజల్. కరోనా వల్ల వచ్చిన ఈ విరామం కథానాయికలకు ఇలా ఉపయోగపడుతోందన్నమాట.