కరోనా వల్ల డైలీ పేపర్ల బరువు తగ్గింది. 16 పేజీల పేపరు కాస్త 12 పేజీలకు వచ్చింది. క్రీడా, సినీ వార్తలకు సగం పేజీలే కేటాయించారు. ఇప్పుడు అవి కూడా ఎత్తేయాలని ప్రింట్ మీడియా యాజమాన్యాలు భావిస్తున్నాయి.. ఈరోజు అంధ్రజ్యోతి లో `చిత్ర జ్యోతి` రాలేదు. ఈనాడు, సాక్షిలు కూడా సినిమా పేజీని పూర్తిగా ఎత్తేయాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజానికి ఆదివారం లాక్ డౌన్ ప్రకటించినప్పుడు సైతం ఆ రోజు డైలీ పేపర్ల ప్రింటింగ్ ఆపేయాలని అనుకున్నారు. కానీ… దేశం మొత్తం రెడ్అలెర్ట్ లాంటి పరిస్థితి ఉన్నప్పుడు – మీడియా సంస్థలు ఇంకాస్త విస్త్రతంగా, బాధ్యతా యుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని భావించి – కర్ఫ్యూ సమయంలోనూ డైలీ పేపర్లు పనిచేశాయి. కానీ.. సినిమా పేజీ, క్రీడా పేజీల వల్ల ఇప్పుడు పెద్దగా ఒరిగేదేమీలేదని, అప్ డేట్లు లేనప్పుడు పేజీల్ని ఎలాగోలా నింపడం మంచి పద్ధతి కాదని ఈనాడు, సాక్షి యాజమాన్యాలు భావిస్తున్నాయి. మళ్లీ షూటింగులు మొదలయ్యేంత వరకూ సినిమా పేజీలు కనిపించే అవకాశం లేదు.