ప్రభుత్వ భవనాలపై వేసిన వైసీరీ రంగులను తీసి వేయాలంటూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తొలి విచారణలోనే ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలన్నింటికీ ఆ పార్టీకి చెందిన రంగులేశారు. దానిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో.. విచారణ జరిపిన హైకోర్టు.. పది రోజుల్లో.. వాటిని తొలగించాలని ఆదేశిస్తూ.. ఈ నెల పదో తేదీన ఆదేశాలు జారీ చేసింది. అప్పటికి స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే.. ఈ దిశగా అధికార యంత్రంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వారం రోజుల తర్వాత హైకోర్టులో రంగులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు.. హైకోర్టుకు అధికారం లేదంటూ… ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. అయితే.. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోగా.. పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో ఇప్పుడు .. రంగులను తప్పనిసరిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఇచ్చిన గడువు పది రోజులు ముగిసిపోయింది. ఇప్పటి వరకూ వేసిన రంగుల్లో కొన్నింటినీ కూడా తీసేయలేదు. దీంతో.. ఎవరైనా కోర్టు ధిక్కరణ కింద.. మళ్లీ పిటిషన్ వేస్తే.. ఏపీ సర్కార్ ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలపై ఏ పార్టీ రంగులు ఉండకూడదు. అది నిబంధన. కానీ అధికారిక ఉత్తర్వులు ఇచ్చి మరీ రంగులు వేయించారు. అవి వైసీపీ రంగులు కాదని.. ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కానీ.. పార్టీ రంగులో కాదో తాము పోల్చుకోగలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణ జరిపి.. ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. గ్రామ సచివాలయాలు కూడా.. ప్రభుత్వ భవనాలు కిందకే వస్తాయి కాబట్టి.. వాటి రంగులు కూడా తొలగించాల్సి ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్ బొమ్మను కూడా పెట్టారు. ఇప్పుడు వాటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా.. రంగులు తొలగించకపోతే.. ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.