కరోనా వచ్చిన దగ్గర్నుంచి, ఇప్పటి వరకూ… ట్వీట్లతో హోరెత్తించారు సినీ ప్రముఖులు. ఈ వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో వీరి పాత్ర మర్చిపోలేనిది. అయితే.. అంతా ట్వీట్లకే పరిమితమైపోతే ఎలా? దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. కరోనా రాష్ట్రాలపై కొత్త భారాన్ని మోపింది. రాబడి తగ్గి – ఖర్చు పెరుగుతోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకు ఇప్పుడు చేయూత అవసరం.
అందులో భాగంగానే.. నితిన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల విరాళం (ఒక్కోక్క తెలుగు రాష్ట్రానికి రూ.10 లక్షలు) ప్రకటించారు. తెలుగు సినీ రంగం నుంచి… తొలి ఆర్థిక సహాయం నితిన్ నుంచే వచ్చింది. ప్రకాష్ రాజ్ తన ఉద్యోగులకు మే నెల వరకూ వేతనాలు చెల్లించి సెహభాష్ అనిపించుకుంటే, సినీకార్మికులకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తూ రాజశేఖర్ తన సేవా దృక్పథం చాటుకున్నాడు. అవును… ఇప్పుడు ట్వీట్లు చేసే వేళ్ల కన్నా, సాయం చేసే చేతులు మిన్న. ఎలాంటి విపత్తు ఎదురైనా చిత్రసీమ ధీటుగానే స్పందిస్తుంటుంది. మరోసారి స్టార్ల చేయూత ప్రభుత్వానికీ, ప్రజలకు అవసరమైంది. ఎవరు ఏ స్థాయిలో విరాళాలు ప్రకటిస్తారో చూడాలిక.