బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పేరు గుర్తుందా..? అమరావతిపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత దాన్నే.. నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. అంతకు ముందు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన ఓ బ్లూప్రింట్‌లో ప్రధానమైన భాగాలను ప్రింట్ తీసి.. నివేదిక రూపంలో ఇచ్చింది. ఆ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌నకు ఫీజు ప్రభుత్వం రూ. ఏడు కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. మూడున్నర కోట్లకు చెక్ కూడా.. ఇచ్చేశారు. కరోనాపై చర్యలు తీసుకోవడానికి.. ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. ఫేక్ రిపోర్టులు ఇచ్చిన వారికి మాత్రం.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ… నిధులు చెల్లించేస్తున్నారు.
అసలు బీసీజీను ఎందుకు కన్సల్ట్ చేశారో.. ఎప్పుడు కన్సల్ట్ చేశారో.. ఎవరికీ తెలియదు. అసెంబ్లీలో జగన్ ప్రకటించిన తర్వాత .. ఇచ్చారేమో అనుకున్నారు. అయితే.. కోట్లు ఆఫర్ చేశారని మాత్రం ఎవరికీ తెలియదు. తీరా బోస్టన్ గ్రూప్ .. ప్రభుత్వానికి కావాల్సిన నివేదిక ఇచ్చిన తర్వాత .. ఆ సంస్థతో జరిపిన సంప్రదింపులంటూ.. కొన్ని మెయిల్స్ లీకయ్యాయి. వాటిలో ఆ సంస్థకు …రూ. ఐదు కోట్ల 95 లక్షలుగా ఫీజుగా నిర్ధారించారు. ఎలాంటి జీవో లేకుండా… బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వం.. ఫీజుగా రూ. 5 కోట్ల 95 లక్షలు ఇస్తామని అంగీకరించింది. కానీ ఇప్పుడు అది ఏడు కోట్లు దాటిపోయింది. ఎందుకు అంటే.. వారు కట్టాల్సిన జీఎస్టీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట. అంటే.. ఫీటు పోటుకు పన్నులు ఎక్స్ట్రా అన్నమాట.
ప్రపంచంలో ఇంత వేగంగా .. అత్యంత విశాలమైన సబ్జెక్ట్ పై నివేదిక రూపొందించిన కంపెనీ ఇంకొకటి ఉండదు. తమకు కావాల్సిన నివేదిక కోసం.. 2019 నవంబర్ 27న ..వారి కంపెనీని ఎంపిక చేసినట్లుగా బోస్టన్ కమిటీకి ప్రభుత్వం సమాచారం పంపింది. జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చేసింది. అంటే… ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా తెలిపిన తర్వాత కేవలం.. నెల అంటే.. నెల రోజుల్లోనే… బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. ఇందులో క్రిస్మస్ హాలీడే.. న్యూ ఇయర్ హాలీడేస్.. అన్నీ ఉన్నాయి. అసలు ఆ కమిటీ ఏపీలో ఏ పరిస్థితుల్ని అధ్యయనం చేసిందో ఎవరికీ తెలియదు. ఎక్కడ పర్యటించిందో కూడా తెలియదు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చాక… నెలలో రిపోర్ట్ ఇచ్చిన బీసీజీ ఏడు కొట్లు ప్రజాధనాన్ని జేబులో వేసుకుంది. దానికి కట్టాల్సిన పన్నులు కూడా.. ప్రజాధనాన్నే ముక్కు పిండి వసూలు చేసుకుంటోంది.