మాకు ఉగాదుల్లేవు… ఉషస్సులూ లేవు. ఇది మహా భావ కవి దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి కవిత. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరి పరిస్థితి దేవులపల్లి క్రిష్ణశాస్త్రిగారి పరిస్థితే. బుధవారం నాడు తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ప్రతీ ఏడాది ఈ పండుగను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా జరుపుతాయి. ఆయా రాజధానుల్లో పంచాగ శ్రవణంతో పాటు కవి సమ్మేళనాలు, సంగీత, సాహిత్య కార్యక్రమాలు ఘనంగా జరుపుతారు. ప్రతి ఇంట్లోనూ షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆరగించి పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈసారి మాత్రం తెలుగు ప్రజలు మాకు ఉగాదుల్లేవు.. ఉషస్సులూ లేవు అని కవిత్వాన్నే పాడుకుంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా తరుణంలో… ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలుగు ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలకు తెరతీసింది. ప్రజలను ఈ నెల 31 వరకూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హుకుం జారీ చేసింది. ఈ నిబంధనలను పాటించని వారిపై ఉక్కుపాదం మోపక తప్పదని హెచ్చరిలు కూడా చేస్తోంది. ఒక్క హెచ్చరికలకే పరిమితం కాకుండా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. రోడ్లపైకి ప్రజలు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని, లాక్ డౌన్ కు సహకరించాలంటూ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఉగాది పండుగ వేడుకలు పూర్తిగా రద్దు చేసినట్లే. ప్రతి ఏటా జరిగే పంచాగ శ్రవణాలు ఉండవు. కవి సమ్మేళనాలు ఉండవు. కరోనా ఘాష తప్ప కోకిలల కూతలు ఉండవు. నిబంధనలు కాలరాసి బయటకు వెళ్తే పోలీసుల చర్యలతో పచ్చడై పోవడం తప్ప ఉగాది పచ్చడి అస్సలు ఉండదు. జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు, సుఖం, విషాదాలకు ప్రతీక ఉగాది పచ్చడి ఇప్పడు ఒకే ఒక్క రుచి…. కరోనాకే పరిమితం అవుతోంది.