దేశం ఇప్పుడు సంక్షోభం దిశగా నడుస్తోంది. దానికి కారణం… కరోనా వైరస్. ఈ దశలో ప్రజల్ని చైతన్యపరచడంలో మీడియా పాత్రే కీలకం. వైరస్ భయం కంటే… తప్పుడు వార్తలే ప్రజల్ని మరింత భయకంపితుల్ని చేస్తున్నాయి. కరోనాపై ప్రభుత్వం ప్రత్యేకమైన వెబ్సైట్, వాట్సప్ ఏర్పాటు చేసి, ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నా – ఇప్పటికీ పుకార్ల గోల వదల్లేదు. ఇలాంటి క్లిష్టమైన దశలో మీడియాకు మార్గదర్శకాలు సూచించారు ప్రధాని నరేంద్రమోడీ.
తాజా పరిణామాల్ని, కీలకమైన విషయాల్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో, సులువైన భాషలో, అత్యంత వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాదే అని గుర్తు చేశారు. ఆరోగ్యంపై అవగాహన ఉండి, సమాజ సేవ చేయాలన్న దృక్పథం ఉన్నవాళ్లను, డాక్టర్లనూ, మేధావుల్ని, లైవ్ డిబేట్లలో కూర్చోబెట్టాలని సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ని ప్రజలు సీరియస్‌గా తీసుకునేలా చూసే బాధ్యతను మీడియాకే అప్పగించారు ప్రధాని. అయితే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు, ప్రజల అభిప్రాయాల్ని సేకరించే టప్పుడు కనీసం ఒక మీటరు దూరంలో ఉండాలని రిపోర్టర్లకు సూచించారు. ఇలాంటి సమయాల్లో ప్రభలే మూఢనమ్మకాల్ని అరికట్టాలని, శాస్త్రీయమైన విషయాలనే ప్రసారం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని. కరోనా మహమ్మారిపై ప్రజల్ని హెచ్చరించాలి తప్ప, మరింత భయపెట్టకూడదని, అది మరింత ప్రమాదమని సూచించారు.