పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగులుతున్న ఎదురు దెబ్బలు .. అన్నీ ఇన్నీ కావు. న్యాయస్థానాల వర్కింగ్ డే అయితే.. ఖచ్చితంగా ఓ మొట్టికాయకు రెడీ కావాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇక ఇతర అంశాల్లో అయినా… ప్రభుత్వం ముందడుగు వేస్తోందా అంటే అదీ లేదు. సోమవారం ఒక్క రోజే… నాలుగు విభిన్న అంశాలపై హైకోర్టు అక్షింతలు వేసింది. నిర్ణయాలపై స్టే విధించింది.
చట్టాలు తెలీకుండా పాలన చేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కోర్టుల్లో వీగిపోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా అటూ ఇటూగా యాభై సార్లు ఈ పది నెలల్లో కోర్టు మొట్టికాయలు వేసింది. నిన్న ఒక్క రోజే.. నాలుగు విభిన్న అంశాల్లో హైకోర్టు వాతలు పెట్టింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లిన పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టులో కార్యాలయాల తరలింపు, రాజధాని భూముల ఇళ్ల కేటాయింపు, విశాఖ ల్యాండ్ పూలింగ్, ఇళ్ల స్థలాలు అమ్ముకోవచ్చనే జీవోలపై.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఇవన్నీ చట్ట విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ భవనాలపై పార్టీ పరమైన రంగులు ఉండకూడదు అన్న విషయం తెలియడానికి చట్టాలు చదవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని ఔపాసన పట్టాల్సిన పని లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజలు తమకు 151 సీట్లు ఇచ్చారంటే.. దానర్థం.. ఆ భవనాలన్నింటిపై సర్వహక్కులు కూడా అనుకుని.. తమ పార్టీ రంగులు వేసేసుకుంది. ఇవాళ కాకపోతే. రేపైనా .. న్యాయస్థానాలు ఈ తీర్పు ఇస్తాయని.. చెట్టు కింద ప్లీడర్ని అడిగినా చెబుతారు. అయినా ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టుకు వెళ్లింది.
హైకోర్టు మొట్టికాయలు వేసినా తప్పు చేశామన్న భావనకు ఎందుకు రావడం లేదు.?
రంగుల విషయంలోనే కాదు… ఒకే రోజు.. ఇళ్ల స్థలాల విషయంలోనూ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని.. స్థలాల పేరుతో పంచడానికి అధికారం మీకెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఇదే కాదు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవో దగ్గర్నుంచి వెనక్కి చూస్తే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు, పోలవరం కాంట్రాక్టులు, ఉపాధి హామీ నిధులు, బార్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు.. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వడం వరకూ..కనీసం యాభై సార్లు ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు అక్షింతలు వేసింది. గతంలో ప్రభుత్వాలు… చట్ట విరుద్ధంగా ఒక్క నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టి వేస్తే… తప్పు చేశామన్న భావనకు వెళ్లేవి. మరోసారి అలాంటి తప్పులు జరగకుండా.. చూసుకోవాలన్న ప్రయత్నాలు చేసేవి. కానీ.. అనూహ్యంగా ఏపీ సర్కార్ తీరు మాత్రం భిన్నంగా ఉంది. చట్టాలు, రాజ్యాంగాల గురించి పట్టించుకోకుండా.. తాము చేయాలనుకున్నది చేసేయడానికి జీవోలు ఇచ్చేస్తోంది. కోర్టులు కొట్టి వేసి.. ఆ నిర్ణయాలు అక్కడ ఆగిపోతే.. పోనీ అనుకుంటోంది కానీ.. తాము తప్పు చేశామన్న భావనకు రావడం లేదు.
తప్పొప్పులు చెప్పాల్సిన యంత్రాంగం పావుగా మారిపోయిందా..?
చట్ట వ్యతిరేక నిర్ణయాలపై హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పడుతోందంటే.. మొదటగా ఆ ప్రభావం.. అధికారులపైనే పడుతుంది. ఎందుకంటే.. నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నా.. అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాల్సింది అధికారులే. అలాంటి ఉత్తర్వులు.. చట్టాలకు.. రాజ్యాంగానికి లోబడి ఉండేలా చూసుకోవడం అధికారుల పని. చట్ట వ్యతిరేకంగా ఉంటే.. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు అలాంటి సాహసం చేయలేకపోకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా వారు జీవోలు జారీ చేసేస్తున్నారు. వివాదాల్లో చిక్కుకుంటున్నారు. చివరికి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు లేఖలు కూడా రాయాల్సి వస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతుంది. రాజ్యాంగం ప్రకారమే పని చేయాలి. 151 కాదు.. 175 సీట్లు వచ్చినా.. రాజ్యాంగాన్ని మించి అధికారాలు దఖలు పడవు. అలాగే.. తామిష్టం వచ్చినట్లుగా చేయడానికి ఉండదు. ఏదైనా చట్టబద్ధంగా చేయాలి. కానీ ఈ స్పృహ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.