కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో భారత్ ముందే మేల్కొన్నదా.. ఆలస్యం అయిందా అన్న వాదోపవాదాలు పక్కన పెడితే.. ఇప్పుడు ప్రమాదం అంచున ఉందన్నది మాత్రం నిజం. మూడో స్టేజ్‌కు చేరువగాఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ రెండో స్టేజ్‌లో ఉంది. విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వైరస్ విస్తరింపజేసేది రెండో దశ. ప్రస్తుతం మనదేశంలో రెండోదశ కొనసాగుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా మూడో దశకు దగ్గరగా ఉంది. అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కాకుండా.. ఇక్కడ సోకిన వారి ద్వారా మరోకరికి సోకడం.. సామాజికవ్యాప్తి. మూడో దశ ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తున వైరస్ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. నియంత్రణ కష్టమవుతుంది..
ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం మూడో దశను ఎదుర్కొంటున్నాయి. చైనాతో పోలిస్తే భారత్‌లో జనసాంద్రత చాలా ఎక్కువ. మన దేశంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 420 మంది నివశిస్తున్నారు. చైనాలో ఆసంఖ్య 148 మాత్రమే. అందుకే భారత్‌లో రెండోదశ దాటి.. మూడోదశకు చేరితే వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లోకి వ్యాపించడానికి 30 రోజుల సమయం పడుతుందనే అంచనా ఉంది. ఈ లోపు కట్టడి చేయగలిగితే.. దేశం గొప్ప విజయాన్ని నమోదు చేసినట్లు అవుతుంది.
ప్రజలందర్నీ ఏకతాటిపైకి తేవడం.. వారందర్నీ ఇళ్లలోనే ఉంచడం.. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేయడం.. వంద శాతం సక్సెస్ కావడం కష్టం. అందుకే.. భారత్‌లో మూడో దశ తప్పకపోవచ్చన్న అంచనా ఉంది. అందుకే మూడోదశలో తీసుకోవాల్సిన చర్యలకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సామూహిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రయివేటు ఆసుపత్రుల్ని, లేబొరేటరీలను కూడా భాగస్వాముల్ని చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఐసొలేషన్ వార్డులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి వస్తుందన్న ఆలోచనతో ఎన్నెన్ని ఇండిపెండెంట్ రూములు, బెడ్లు అవసరమవుతాయన్న అంచనాల తయారీలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉంది. ఇప్పటికే నియోజకవర్గానికి వంద చొప్పున ఐసోలేషన్ బెడ్లను సిద్దం చేయాలని ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఇప్పుడు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలన్నీ.. అ స్థాయిని వీలైనంత వరకూ తగ్గించడానికేనని చెబుతున్నారు.