హైదరాబాద్: బీసీ సంఘాల నాయకుడు, తెలుగుదేశం నేత, హైదరాబాద్ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో తనకు ఎటువంటి సంబంధాలూ లేవని చెప్పారు. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తానన్నారనే టీడీపీలో చేరానని అన్నారు. ఏ పార్టీ జెండా మోసేవాడిని కానని చెప్పారు. బీసీ సంఘాల నేతగా ఉండటమే తనకు ఇష్టమని తెలిపారు. తనను టీడీపీ నాయకుడిగా చూడకూడదని, బీసీ నాయకుడిగా చూడాలని కోరారు. కాపులను బీసీల్లో చేరిస్తే చంద్రబాబుతో, ప్రధానితో కూడా పోరాడతానని అన్నారు. కాపులకు ప్యాకేజి ప్రకటిస్తే అభ్యంతరం లేదని చెప్పారు.
కృష్ణయ్య నిన్న విజయవాడలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చటం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం అది ఎలా సాధ్యమో చెప్పాలని హుంకరించారు. దీనిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ స్పందిస్తూ, కృష్ణయ్య వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న అంశం టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టిన విషయం కృష్ణయ్యకు తెలియదా అని అడిగారు. రవీంద్ర వ్యాఖ్యలపైనే కృష్ణయ్య ఇవాళ స్పందించినట్లుగా కనబడుతోంది.