అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ… ఇలా మనకు అనేక రకాల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు పండగ చేసుకుంటున్నాయి. అవును.. థియేటర్లు బంద్ అయ్యాయి. జనాలు బయట తిరగడానికి వీల్లేదు. ఆఫీసులు క్లోజ్. అంతా ఇంటిపట్టునే ఉండాలి. అందుకే.. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ని వేదిక చేసుకుంటున్నారు ప్రజలు. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్.. ఆహా, జీ.. ఇలా అన్ని రకాల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి బాగా డిమాండ్ పెరుగుతోంది. వాటిలో ఉన్న సినిమాల్ని, వెబ్‌సిరీస్‌లను చూస్తూ జనాలు కాలక్షేపం చేస్తున్నారు. సబ్ స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నాయి. దాని వల్ల ఓటీటీ వేదికలకు మంచి ఆదాయం వస్తోంది. అయితే ఇక్కడే ఓ సమస్య ఉత్పన్నమవుతోంది. అమేజాన్, నెట్ ఫ్లిక్స్లపై ప్రేక్షకులు ఒక్కసారిగా దాడి చేయడం వల్ల… వీడియో క్వాలిటీ నాణ్యతని తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈ ఓటీటీ వేదికలన్నీ హెచ్ డీ వీడియోలను అందిస్తున్నాయి. అయితే వాటిని ఎస్ డీ క్వాలిటీకి మార్చాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. అందులో భాగంగా అమేజాన్ త్వరలో వీడియో క్వాలిటీని తగ్గించడానికి పూనుకుంది. ఇక మీదట కొన్ని రోజుల పాటు అమేజాన్‌లో హెచ్ డీ క్వాలిటీతో సినిమాలు చూడడం కష్టమే. ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే ఫాలో అయితే మిగిలిన ఓటీటీ వేదికలు దాన్ని అనుసరించడం తధ్యం.