విశాఖ కరోనా డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. మూడో పాజిటివ్ కేసు నమోదయింది. ఇందులో రెండో దశ పాజిటివ్ కేసు..అంటే.. విదేశాల నుంచి వచ్చిన వారు కాకుండా… వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందడంతో.. అధికార యంత్రాంగంలో టెన్షన్ ప్రారంభమయింది. వెంటనే.. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని.. హుటాహుటిన విశాఖ వెళ్లి సమీక్ష నిర్వహించారు. కరోనాను కట్టడి చేయడానికి ఇరవై కమిటీలను నియమించారు. లాక్‌డౌన్‌ను.. పటిష్టంగా అమలు చేయాలని దిశా నిర్దేశం చేశారు. సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో ఇప్పటికి 1470 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారు. వీరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్న కారణంగా.. హోం క్వారంటైన్‌కు పంపారు.
మొత్తంగా విదేశాల నుంచి వచ్చిన వారు… ఎంత మంది .. వాళ్లెవరు అన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడంతోనే సమస్య వస్తోంది. స్వచ్చందంగా ముందుకు వచ్చి వివరాలు చెప్పిన వారో… ఇటీవలి కాలంలో వచ్చిన వారి వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన వారికి మొదటగా.. టెస్టుల్లో ఈ విషయం బయటపడదు. పధ్నాలుగు రోజుల తర్వాతే తెలుస్తోంది. ఈ లోపే అతని ద్వారా ఇతరులకు సోకుతోంది. ఇది రెండో దశ. ఈ దశ వైజాగ్‌లో ప్రారంభమయింది. అందుకే ప్రభుత్వం కూడా టెన్షన్ పడుతోంది.
వ్యాధిని విస్తరించినంత వరకూ ఆపాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఇప్పటికిప్పుపుడు.. కరోనా విస్తరణను నిలిపివేస్తే.. సక్సెస్ అయినట్లే. కానీ అసలు వైరస్ ఎంత మందికి ఉన్నదనే విషయమే ప్రభుత్వానికి తెలియకుండా పోయింది. ఇప్పటికి ఏపీలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. పరిస్థితులు ఎలా వచ్చినా తాము ఎదుర్కొంటామని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.