దేశంలో నిరక్ష్య రాస్యత తక్కువ ఉన్నప్పుడు ప్రజల్లో చైతన్యం ఉండేది. కుల, మత, ప్రాంత వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అలాగే… ప్లేగ్ లాంటి మహమ్మారిలు ఎటాక్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు దేశంలో అక్షరాస్యత పెరిగిపోయింది . కానీ ప్రజల్లో చైతన్యం మాత్రం కనిపించడం లేదు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా… నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుస్తున్నారు.
వైరస్ భయం ఉన్నా జనం రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు..?
ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం అయింది. ప్రజలు కరోనా సీరియస్ నెస్ని అర్థం చేసుకున్నారని అనుకున్నారు. ప్రభుత్వం నిర్బంధంగా విధించింది కాదు.. ప్రభుత్వ పిలుపుతో ప్రజలే పాటించింది. అంటే.. వారిలో చైతన్యం వచ్చిందనుకున్నారు. కానీ.. సమయం ముగిసిన తరవాత గుంపులు గుంపులుగా వచ్చి.. విజయోత్సవాలు చేసుకోవడంతోనే.. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించేశారు. ప్రజలు అసలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. కార్లు, టూవీర్లు తీసుకుని రోడ్డెక్కారు. ఇలా చేయడం ఎంత డేంజరో వారికి అర్థం కాలేదో.. అర్థం అయ్యేటట్లు ప్రభుత్వాలు చెప్పలేదో.. అంచనా వేయడం కష్టం. ప్రధాని మోడీ కూడా లాక్డౌన్ సీరియస్‌గా తీసుకోవాలని కోరాల్సి వస్తోంది. ఇదంతా కాదులే అని.. కేసీఆర్ తనదైన స్టైల్లో కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు కూడా జారీ చేశారు.
స్పెయిన్, ఇటలీ, ఇరాన్ .. దుస్థితి కళ్ల ముందు కనిపిస్తోందిగా..?
లాక్డౌన్ లక్ష్యం. ప్రజల మధ్య సోషల్ డిస్టెన్స్‌ను పెంచడం. ఒకరినొకరు తాకుండా ఉండడం… కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవడం కోసం ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ఇది ప్రజలను రక్షించేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం. ఒక్కసారి వ్యాధి విజృంభిస్తే ప్రభుత్వాలు కూడా చేయగలిగిందేమీ ఉండదు. అన్నిటినీ తట్టుకుని నిలకడగా ఖండాంతరాకు విస్తరిస్తూపోయే వ్యాధి మహమ్మారిలా మనను చుట్టుకోక ముందే జాగ్రత్త పడడం సాధారణ ప్రజల విధి. పకడ్బందీ చర్యలు అవసరని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి నుంచి హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ఇటలీ, ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి.
చైనా తరహా ఆర్మీ నిర్బంధమే శరణ్యమా..?
లాక్డౌన్ ప్రకటించింది నిత్యావసరాల కొరత సృష్టించడానికి కాదు. కరోనా ముందు జాగ్రత్తల విషయంలోనూ అడుగడుగునా మనం ఇలాగే కక్కుర్తి బయటపెట్టుకుంటే నష్టపోయేది.. ప్రజలే. ఏదో కరువు వచ్చినట్టు… కిరాణా దుకాణాలపై పడిపోవడం .. ఇళ్ళలో ఖాళీగా ఎందుకని రోడ్లపై తిరగడం … ఇలాంటి విపరీత ధోరణితో ప్రవర్తించడం అంటే … తమ ప్రాణాలకే కాదు.. చుట్టూ ఉన్న వారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టడమే అని తెలుసుకోలేకపోతున్నారు. వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ లో ఇప్పుడు … కరోనా అడ్రస్ లేకుండా పోవడానికి కారణం.. ఈ జనతా కర్ఫ్యూనే. దీన్ని అక్కడి ప్రభుత్వం బలవంతంగా అమలు చేసింది. బయటకు వచ్చిన వాళ్లపై కేసులు పెట్టింది. తీవ్రమైన శిక్షలు విధించింది. అలా చేస్తేనే అక్కడ వైరస్ కట్టడి అయింది. వ్యాప్తి తగ్గిపోయింది. ఇక్కడ కూడా అలాంటి నిర్బంధం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని రోడ్లపైకి వస్తున్న వారు తెచ్చి పెడుతున్నారు…