భారత్లో చాలా తక్కువ కేసులు నమోదయ్యాయని.. కరోనాపై విజయానికి భారత్ ఒక్క “లాక్డౌన్” దూరంలో ఉందన్న విశ్లేషణలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అమెరికాలో రాపిడ్గా విస్తరిస్తోందని.. అక్కడ బయట పడుతున్న కేసులు వెల్లడిస్తున్నాయని.. కానీ భారత్లో ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇలాంటి విశ్లేషణలు చేసేవాళ్లు … సమస్యను గుర్తించకుండా నిప్పులపై దుప్పటి కప్పుతూ ప్రమాదకర పరిస్థితులకు దారి చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. అమెరికాలో రోజుకు పదివేల స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే… ఏ స్థాయిలో టెస్టులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతకు పది రెట్ల స్థాయిలో రోజుకు టెస్టులు చేస్తేనే.. ఆ ఫలితాలు వస్తున్నాయి. కానీ భారత్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు చాలా పరిమితం. రోజుకు వందల్లోనే టెస్టులు జరుగుతున్నాయి. పుణెలోనే ప్రామాణికమైన ల్యాబ్ ఉంది.
అదే సమయంలో… కరోనా టెస్టు కిట్లు కూడా.. కావాల్సినంతగా లభించే పరిస్థితి లేదు. వీలైనంత ప్రామాణికంగా టెస్టులను నిర్వహించేందుకు.. వివిధ సంస్థలకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అయితే.. వేల సంఖ్యలో మాత్రం శాంపిళ్లను ఇప్పటికీ టెస్ట్ చేయడం లేదు. అమెరికాలో కూడా.. కరోనా పాజిటివ్ ను టెస్ట్ చేసే పద్దతిని మార్చుకోవాలనుకుంటున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.. దక్షిణ కొరియా సాయం కోరారు. కరోనా టెస్టు కిట్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో దక్షిణ కొరియా అందరి కంటే ముందే మేలుకుని… కరోనా గుర్తింపు … కట్టడి దిశగా అడుగులు వేసింది.
భారత్ మాత్రం.. ఇంకా పెద్ద స్థాయిలో.. ముందడుగు వేయలేదని… అమెరికా.. కొరియా సన్నద్ధతను బట్టి చూస్తే తెలిసిపోతుందంటున్నారు. పెద్ద ఎత్తున అనుమానితులను టెస్టులు చేసి.. వారెవరికీ కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే… హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా పరిమితంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని.. నిర్లిప్తంగా ఉంటే.. మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.