మూడు వారాల పాటు భారత్ లాక్ డౌన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్లో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, కొంతమంది ఉద్యోగులకు టెన్షన్ మొదలైంది. ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ అని మొదట చెప్పారు కాబట్టి, వారం రోజులు ఉంటే సరిపోతుంది అనుకున్నారు. కానీ, మూడు వారాలు అనేసరికి… హాస్టళ్ల యాజమాన్యాలు కూడా వీళ్లని సొంత ఊళ్లకు వెళ్లాలంటూ కొంత ఒత్తిడి తెచ్చాయి. దీంతో, బుధవారం ఉదయం నుంచే నగరం నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని చాలామంది ప్రయత్నించారు. అయితే, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలన్నీ రహదారులను పూర్తిగా మూసేశాయి. దీంతో, అనుమతుల కోసం పోలీస్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టారు.
అనుమతులు పొందినవారు పెద్ద సంఖ్యలో ఆంధ్రాకి బయల్దేరారు . అయితే, రాష్ట్ర సరిహద్దుల దగ్గర వీరికి అనుమతి లేదంటూ అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి వచ్చింది. హాస్టళ్ల నుంచి స్వస్థలాలకు తరలి వస్తున్నవారి విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ తో, ఏపీ మంత్రి బొత్స మాట్లాడారు. ఎక్కడివారు అక్కడ ఉండటమే శ్రేయస్కరం అని సూచించారు. హైదరాబాద్లో హాస్టళ్ల యాజమాన్యాలతో మాట్లాడాలంటూ అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులను ఖాళీ చేయించొచ్చదనీ, యథాతథంగా హాస్టళ్లను రన్ చేయాలంటూ కోరారు. విద్యార్థులను ఖాళీ చేయించొద్దంటూ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడారు. అయితే, హాస్టళ్లలో ఉండేవారిని బయటకి పంపొద్దంటూ యాజమాన్యాలకు చెప్పారు. స్వస్థలాలకు వెళ్లొచ్చంటూ ఇంతవరకూ ఇచ్చిన అనుమతి పత్రాలు చెల్లవని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికే ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్న విద్యార్థులు, కొంతమంది ఉద్యోగులు తమను అనుమతిస్తారని అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి.
లాక్ డౌన్ రోజుల్లో హాస్టళ్లను మూసివెయ్యొద్దంటూ ముందే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదు. ఇంకోటి… విద్యార్థులైనా, ఉద్యోగులైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. హైదరాబాద్ నుంచి స్వస్థలానికి వెళ్లిపోతే సేఫ్ అనుకోవడం సరైంది కాదు. ఎక్కడున్నా ఇంటికే పరిమితం కావాలి. ఉన్నచోటి నుంచి కదల కూడదు. హైదరాబాద్లో పనిలేదు కదా, బోరు కొడుతుంది కదా, ఇంకా 20 రోజులపాటు కదలకుండా ఉండలేం కదా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నవారూ కొంతమంది మీడియాలో దర్శనమిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం అనే అత్యవసర పరిస్థితి ముందు ఇలాంటివన్నీ చాలా చిన్నవి. పరిస్థితి తీవ్రతను ఇంకా కొంతమందికి అర్థం కావడం లేదు! పోలీసులు, ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోందీ, వారికి ప్రజల మీద కక్ష సాధింపులు ఉద్దేశాలు ఏముంటాయి ఇలాంటి సమయంలో! ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిన సందర్భం ఇది, అంతే!