కరోనా వైరస్ సోకినా వందల మందికి లక్షణాలు బయటపడకపోవడం కొత్త సమస్యగా మారుతోంది. చైనాలో కరోనా లక్షణాలు లేకపోయినా… ఇతర కరోనా వైరస్ సోకిన వారితో కలిసి తిరిగిన వారిని టెస్టులు చేస్తున్నారు. అందులో కరోనా పాజిటివ్‌గా అనేక వందల మంది తేలుతున్నారు. కానీ వారిలో జలుబు, జ్వరం. .. దగ్గు లాంటి లక్షణాలేమీ కనిపించడం లేదు. పదిహేను రోజులు కాదు.. ఇరవై రోజులు ఉన్నా..వారు ఆరోగ్యంగానే ఉంటున్నారు. దీంతో చైనా అధికారులకు కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి వారు ఎంత మంది ఉన్నారో.. కరోనా లక్షణాలు బయటపడకుండా వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారో చైనా అధికారులకు అంతు చిక్కకుండా ఉంది.
ఇటీవలి కాలంలో చైనా పరీక్షలు జరిపి వంద మందిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వారిలో 33మందికి లక్షణాలు ఏ మాత్రం లేవు. చాలామంది అంతటా ఆరోగ్యంగా కనిపించినప్పటికీ వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. రెండు రోజుల కిందట.. బయటకు వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. చాంగ్కింగ్ అనే నగరంలో పరీక్షించిన వారిలో 18 శాతం మందికి కరోనా సోకింది. కానీ లక్షణాలు మాత్రం బయటపడలేదు వీరందర్నీ క్యారియర్లుగా పేరు పెట్టేసిన చైనా.. జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనాలో గణనీయమైన సంఖ్యలో ఈ క్యారియర్లు ఉన్నారని.. ప్రభుత్వానికి అర్థమైపోయింది. అనారోగ్యంతో ఉన్నారని తెలియకుండానే కరోనా వ్యాప్తి చేసే అవకాశం ఉంది.
చైనాలో లాక్ డౌన్ ముగియడంతో ఈ క్యారియర్లు వేలాది మందికి అంటువ్యాధులను తిరిగి తగిలిస్తారనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక్క చైనాలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ.. కరోనా లక్షణాలు కనిపించిన వారిని మాత్రమే టెస్ట్ చేస్తున్నాయి. మిగతా వారిని ఐసోలేషన్ .. క్వారంటైన్లకే పరిమితం చేస్తున్నాయి. ఆ లోపు వైరస్ లక్షణాలు బయటపడితే సరికి.. లేకపోతే నెగటివ్ అని చెప్పి వదిలేస్తున్నారు. ఇప్పుడు నానా తిప్పలు పడి.. కరోనాను కంట్రోల్ చేస్తే.. వీరు.. మొత్తానికే మోసం తెచ్చి పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు.