గుంటూరులో యాభై ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అధికారయంత్రాంగం హుటాహుటిన అతనికి ఎక్కడ సోకింది.. ? ట్రావెల్ హిస్టరీ ఏమిటి..? అతను ఎవరెవర్ని కలిశాడో మొత్తం ఆరా తీశారు. ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమంలో రెండున్నర రోజుల పాటు ప్రార్థనలు చేసి దురంతో ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ వచ్చారు. అక్కడ్నుంచి గుంటూరుకు క్యాబ్‌లో వచ్చారు. ఆ తర్వాత పలువుర్ని కలిశారు. అలా కలిసిన వాళ్లలో… అధికార పార్టీకి చెందిన కీలక నేత కూడా ఉన్నారు. పోలీసులు ఈ రికార్డు మొత్తం బయటకు తీశారు. వెంటనే.. ఆ కీలక నేతను అలర్ట్ చేశారు. హోంక్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. కానీ.. సదరు నేత పోలీసులపై మండిపడ్డారు. తాను హోం క్వారంటైన్‌కు వెళ్లేది లేదని.. ఆ కరోనా పాజిటివ్ వ్యక్తి తనను కలిసిన విషయం బయటకు పొక్కకూడదని చెప్పి పంపేశారు.
అలాగే.. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. కుటుంబసభ్యులతో కలిసి ఉగాదిని ధూం..ధాంగా జరుపుకున్నారు. ఇంట్లో జరుపుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టేవారు కాదేమో. సామాన్య భక్తులను పూర్తిగా రాకుండా నిలిపివేసి… స్వామి వార్లకు మాత్రమే సేవలు చేస్తున్న దుర్గ గుడి ఆలయంలో ఆయన కుటుంబంతో కలిసి ఉగాది వేడుకలు చేసుకున్నారు. ఆలయం మొత్తం ఆయన కుటుంబం, సన్నిహితులతో నిండిపోయింది. ఆలయ అర్చకులు.. అమ్మవారితో పాటు.. మంత్రి కుటుంబం కోసం.. ప్రత్యేక పూజలు చేయాల్సి వచ్చింది. మంత్రి తీరు చూసి.. విస్తుపోవడం.. జనం వంతు అయింది.
కరోనా వైరస్‌కు… అధికారం ఉందా లేదా అన్న తేడా తెలియదు. పేదవాడా.. ధనవంతుడా అన్న తేడా కూడా తెలియదు. ఈ విషయంలో అందరూ సమానమే. అందరూ నిబంధనలు పాటించాల్సిందే. అధికార పార్టీ నేతలు ఇంకా ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. వారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే రూల్స్ అన్నీ పాటించి… ఆదర్శంగా నిలవాల్సి ఉంటుంది. కానీ ఏపీలో అధికార పార్టీ నేతలు.. తాము వైరస్‌కు అతీతమన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో.. ప్రజల్లోనూ నిర్లిప్త భావన కనిపిస్తోంది.