అమరావతి రైతుల పోరాటానికి వంద రోజులు అయ్యాయి. పోలీసులు లాఠీలతో విరుచుకుపడినా వెనక్కి తగ్గని రైతులు… కరోనా విజృంభిస్తున్నా… నిబంధనలకు అనుగుణంగా నిరసనలు తెలియచేస్తూ… పట్టుదల ప్రదర్శిస్తున్నారు. వంద రోజుల కిందట.. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చినప్పటి నుండి రైతులు.. పోరుబాట పట్టారు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలను తిన్నారు. కేసుల పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. రాజధాని ఉద్యమంలో పాల్గొన్న.. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది జైళ్లకు వెళ్లారు. అయినా… ఎవరూ వెనక్కి తగ్గలేదు.
ప్రభుత్వం రైతుల్ని అసలు రైతులుగా పరిగణించకపోవడంతోనే సమస్య వచ్చింది. రాజధానికి భూములివ్వడమే వారి తప్పు అని.. అనుభవించాల్సిందేనన్నట్లుగా పరిస్థితి మారింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నా ప్రభుత్వం మాత్రం మారడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అమరావతిలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడెప్పుడు విశాఖ వెళ్లిపోదామా అని చూస్తున్నారు. ఇంత కరోనా కాలంలోనూ.. మే 22 తేదీకి విశాఖ వెళ్లిపోవాలని.. ఆయన అధికార యంత్రాంగానికి డెడ్ లైన్ విధించారన్న ప్రచారం జరుగుతోంది. రైతుల గురించి మాత్రం.. ఆలోచించడం లేదు. తరలింపు ఎజెండాతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
రాజధాని రైతులు.. పోరాటం ఆగదని నిరూపించడానికి తమ వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. కరోనా కారణంగా.. శిబిరాలు ఎత్తేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఉన్న దాని ప్రకారం.. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ… నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ విశ్రమించబోమని చెబుతున్నారు. మరో వైపు న్యాయపోరాటంోల మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కర్నూలుకు కార్యాలయాలు తరలించాలన్న జీవోపై హైకోర్టులో పిటిషన్ వేసి.. స్టే తీ సుకు రాగలిగారు. మరికొన్ని కీలక పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఎంత పోరాటం చేసి అయినా సరే.. రాజధాని అమరావతిలో ఉండేలా కాపాడుకుంటామని వారు ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు.