ఏ విషయంలోనైనా సరే, పవన్ కల్యాణ్ బాటలో నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు రామ్ చరణ్. ఇప్పుడూ అంతే. కరోనా బాధితుల సహాయార్థం బాబాయ్ పవన్ కల్యాణ్ రూ.2 కోట్ల సహాయం ప్రకటించిన వెంటనే.. తన వంతుగా విరాళం ప్రకటించేశాడు. కేంద్ర ప్రభుత్వానికీ, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకూ 70 లక్షలు అందించబోతున్నట్టు ట్వీట్ చేశాడు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ తనకు స్ఫూర్తినిచ్చారంటూ.. ట్వీట్లో పేర్కొన్నాడు చరణ్. కరోనాని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని, వాటిని తన వంతుగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ట్వీట్ చేశాడు రామ్ చరణ్. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్.. చరణ్‌ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి సైతం తన వంతుగా రూ.10 లక్షలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5 లక్షలు ఇస్తామన్నారు.