కరోనా దెబ్బకు లాక్డౌన్ అయిపోయిన ప్రజల ఆర్థిక జీవితాలను బాగు చేసేందుకు కేంద్రం.. రూ. లక్షా 70వేల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించింది. మూడు నెలల పాటు ఐదు కేజీల బియ్యం అదనంగా ఇవ్వడం.. ఓ కేజీ పప్పు పంపిణీ చేయడం… జనధన్ అకౌంట్లు ఉన్న మహిళల ఖాతాలకు వచ్చే మూడు నెలల పాటు.. నెలకు రూ. ఐదు వందలు జమ చేయడం… ఈ ప్యాకేజీలో హైలెట్స్. 20కోట్ల మంది మహిళలకు నెలకు రూ. ఐదు వందలు అందిస్తారు. ఇవి కాకుండా.. కరోనా పై సమరంలో కీలకంగా పని చేస్తున్న శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ఇతర సిబ్బందికి యాభై లక్షల బీమా కల్పించారు.
ఇక నేరుగా నగదు బదిలీ.. జన్థన్ ఖాతాలు ఉన్న మహిళలకు మాత్రమే… మిగతా ప్యాకేజీలో సాయం పొందాలనుకునేవారిపై అనేక రకాల ఆంక్షలు పెట్టారు. స్వయం సహాయక బృందాలకు రుణపరిమితిని రూ.10లక్షలకు పెంచారు. ఉపాధిహమీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంచారు. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ప్యాకేజీలో భాగంగా నిర్ణయించారు. ఇక రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. అయితే ఇది వంద మందిలోపు ఉద్యోగులు … ఆ వంద మందిలో 90 శాతం మంది రూ. 15 వేలులోపు జీతం తీసుకునేవాళ్లు ఉంటేనే లభిస్తుంది. అంటే.. 95 శాతం కంపెనీలు అర్హత పొందవు.
భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా మీ ప్రకటించలేదు. కానీ.. రూ.31 వేల కోట్లతో వారి సంక్షేమ నిధి ఇప్పటికే ఉంది.. దాన్ని ఉపయోగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రజలకు జరుగుతున్న నష్టంతో పోలిస్తే..కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కంటి తుడుపునేనన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి కోల్పోయిన పేదలకు ఐదు కేజీల బియ్యం..నెలకు ఐదువందలు ఇస్తే.. ఎలా సాయం చేసినట్లన్న ప్రశ్న వినిపిస్తోంది.