మన హీరోలు.. రీల్ హీరోలు మాత్రమే కాదు. రియల్ హీరోలు కూడా. తెరపై సందేశాలు దంచి కొట్టడమే కాదు, అవసరం అయినప్పుడు సందేహం లేకుండా సాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు కూడా. తెలుగు ప్రజల్ని ప్రకృతి వైపరిత్యాలు కబలించినప్పుడు, `నేనున్నా` అంటూ ఆదుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఓ మనిషి.. మరోమనిషికి సాయం అందించాల్సివచ్చినప్పుడు కూడా అంతే గొప్పగా స్పందిస్తున్నారు. ఎవరికి తోచినంత వాళ్లు సహాయం చేస్తున్నారు. కోట్లు ధారబోస్తున్నారు. నితిన్ రూ.20 లక్షలతో ఈ సాయానికి శ్రీకారం చుడితే ఈ రోజు పవన్ కల్యాణ్ రూ.2 కోట్లతో దాన్ని తారాస్థానికి తీసుకెళ్లాడు. రామ్ చరణ్ 70 లక్షలు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. ఇప్పుడు మిగిలినవాళ్లంతా మెల్లమెల్లగా ముందుకొస్తున్నారు. చిరంజీవి నుంచి కోటి రూపాయల సాయం అందితే, ప్రభాస్ మరో కోటి ఇచ్చి ఈ విషయంలోనూ తాను `బాహుబలి`నే అని నిరూపించుకున్నాడు. మహేష్ కూడా కోటి రూపాయలు అందించనున్నాడు. సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, అల్లరి నరేష్ రూ.10 లక్షలు, సతీష్ వేగేశ్న రూ.10 లక్షలు, అనిల్ రావిపూడి రూ.10 లక్షలు, కొరటాల శివ 10 లక్షలు, దిల్‌రాజు రూ.20 లక్షలు, త్రివిక్రమ్ రూ.20 లక్షలు, సహాయం ప్రకటించారు.
మరి హీరోయిన్ల మాటేమిటి?
టాలీవుడ్లో చెప్పుకోవడానికి చాలామంది హీరోయిన్లున్నారు. తెలుగు చిత్రసీమ మా పుట్టినిల్లు.. అని గర్వంగా చెబుతుంటారు. కానీ ఇలాంటి సమయంలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకొచ్చి సహాయం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈసారీ అంతే. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్లు చేశారు గానీ, ఏ ఒక్కరూ ఆర్థిక సహాయం మాత్రం ప్రకటించలేదు. కొంతమంది ఇంట్లో కూర్చుని వంటా వార్పూ చేసుకుంటుంటే, ఇంకొంతమంది మంది వ్యాయామాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆ వీడియోల్ని ఫేస్ బుక్‌లోనూ, ట్విట్టర్లలోనూ పోస్ట్ చేసి లైకులు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇదేనా సమాజ సేవ అంటే..?