” ఎవరో జ్వాలను రగిలించారు.. మరెవరో ఆజ్యం పోశారు.. ఇంకెవరో దానికి బలవుతున్నారు…” అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి మారిపోయింది. తాము చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నాయి ప్రపంచదేశాలు. ఆ శిక్ష ఎంత తీవ్రమైనదో అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. తమ దేశం శ్మశానంగా మారిపోతుందేమో అని ఇటలీ ఆందోళన చెందుతూంటే… అగ్రరాజ్యం హోదా పోయి బికారి మరిపోతామేమోనన్న భయంతో.. ప్రాణనష్టం జరిగినా లాక్డౌన్ లాంటి నిర్ణయాల జోలికి అమెరికా పోవడం లేదు. ప్రపంచం బాధ.. ప్రపంచానిది. కానీ.. దేశంలో ఈ కరోనా అంటే ఏమి తెలియని జనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
బయటకు రాకుండా రోజుల తరబడి జీవించే స్థోమత దేశంలో ఎంత మందికి ఉంది..?
స్వచ్చంద కర్ఫ్యూ పాటించాలని.. నరేంద్రమోడీ పిలుపునిస్తే.. అప్పటికి ఇతర దేశాల్లో జరుగుతున్న విలయం చూసి.. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చారు. పధ్నాలుగు గంటల కర్ఫ్యూ అంటే.. పన్నెండు గంటల్లో వైరస్ చచ్చిపోతుందని విశ్లేషణలు చేసి.. పధ్నాలుగు గంటల కర్ఫ్యూ అవగానే… రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ అసలు సినిమా అప్పుడే ప్రారంభమయింది. అప్పట్నుంచి లాక్ డౌన్ ప్రారంభమయింది. ఇప్పటికి అయితే.. వచ్చే నెల ఫద్నాలుగు వరకూ దేశంలో ప్రజెలవరూ అటూ ఇటూ కదలడానికి లేదు. ఆ తర్వాతైనా పరిస్థితి మెరుగుపడుతుందన్న నమ్మకం లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్పడం ప్రారంభించాయి. దీంతో ప్రజల్లో అలజడి ప్రారంభమయింది. ఎందుకంటే.. దేశంలో అత్యధికులు దిగువ మధ్యతరగతి ప్రజలే. ఒక్క నెల జీతం రాకపోతే… జీవితాలు తలకిందులయ్యే పరిస్థితి ఉంటుంది. పనుల్లేకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం.. వీరికి ఐదు కేజీల బియ్యం… కేజీ పప్పు.. అకౌంట్లో ఐదు వందలు వేస్తే సమస్య పరిష్కారం అయిపోతోందని అనుకుంటోంది.
ప్రజల్ని గొడ్డుల్ని బాదినట్లు బాదేయడం గొప్పతనమా..?
ప్రజలు రోడ్ల మీద కనిపిస్తే పోలీసులు బాది పడేస్తున్నారు. చస్తార్రా బాబూ..అంటున్నా.. రోడ్ల మీదకు వస్తున్నారు కాబట్టి.. వాళ్లని అలా కొట్టినా తప్పు లేదని.. సోషల్ మీడియాలో.. కడుపు నిండిన టైంపాస్ మేధావులు రెచ్చిపోతూంటారు. సాటి మనిషిని కొట్టే హక్కు పోలీసులకే కాదు.. ఎవరికీ లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది.. లాక్ డౌన్.. మెడికల్ ఎమర్జెన్సీ లాంటిదే. పూర్తి స్థాయి కర్ఫ్యూ కాదు. అయినా సరే పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని బాదిపడేస్తున్నారు. అసలు వారెందుకు వస్తున్నారు..? రోడ్ల మీదకు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. రోజుల తరబడి.. ఇల్లు కదలకుండా కూర్చుంటే.. కుటుంబం గడిచిపోతుందా..? ఇలాంటి పరిస్థితి ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్ని ఉన్నాయి..? ఉప్పుల కోసమో… పప్పుల కోసమో… ఆస్పత్రి కోసమో.. రోడ్డు మీదకు వెళ్లే అవసరాలు ఉండవా..? అంత మాత్రానికే బాది పడేయ్యాలా..? దానికి సోకాల్డ్ మేధావులు సమర్థించాలా..?
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి శిక్ష అనుభవించాల్సింది ప్రజలా..?
అసలు ఈ అంశంలో ప్రజలు చేసిన తప్పేంటి..?. కరోనా విషయంలో… తప్పు పూర్తిగా ప్రభుత్వాలదే. ఇందులో … ఒక్కటంటే.. ఒక్కశాతం కూడా తప్పు ప్రజలదు లేదు. జనవరి 30వ తేదీన దేశంలో మొదటి సారి కరోనా కేసు బయటపడింది. అప్పటికే చైనాలో అది ఎంత విలయం సృష్టిస్తుందో.. ఎంత రాపిడ్గా వ్యాపిస్తుందో తెలిసిపోయింది. అలాంటి.. దేశంలోకి వైరస్ వచ్చిందని తెలిసిన తర్వాత ప్రభుత్వాలు ఏ జాగ్రత్తలు తీసుకున్నాయి. కేంద్రం పట్టించుకోలేదు.. రాష్ట్రాలూ పట్టించుకోలేదు. అప్పటి నుంచి యధావిధిగా… విదేశాల నుంచి రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. ఫలితంగా… వైరస్ దిగుమతి.. నిరాటంకంగా సాగిపోయింది. ఓ చిన్న బాధ్యతా రాహిత్యం.. ఇప్పుడు లాక్ డౌన్‌కి కారణం. అప్పట్లో భారత్‌లో అడుగు పెట్టిన విదేశీయులు..మహా అయితే.. ఓ అరవై, డెభ్బై వేల మంది ఉంటారు… వారందర్నీ ఐసోలేషన్లోనో… క్వారంటైన్‌లోనే ఉంచి… బయటకు పంపిస్తే.. సమస్యే ఉండేది కాదు. అక్కడ లక్షణాలు బయటపడిన వారు.. అక్కడే క్యూర్ అయ్యే వరకూ ఉండేవారు. కానీ వారందర్నీ.. అలా వదిలేయడం వల్ల.. ఇప్పుడు…కరోనా దేశంలో రెండో స్టేజ్‌కి.. మూడో స్టేజ్ కి చేరిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వాల్ని నిందించి ప్రయోజనం లేదు. కానీ తప్పొప్పుల సమీక్ష జరగకపోతే… అవే తప్పులు మళ్లీ రిపీట్ అవుతాయి.
ప్రజల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టి మళ్లీ సిన్సియార్టీ లేదనే నిందలేస్తారా..?
వైరస్ ముంచుకొచ్చేసింది కాబట్టి.. ప్రజలందరనూ సెల్ప్ క్వారంటైన్‌కి వెళ్లిపోవాలని రాత్రికిరాత్రి ప్రభుత్వాలు తీర్పునిచ్చేశాయి. కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల సంగతి ఏం ఆలోచించారు..? ఒక్కటంటే.. ఒక్క శాతం ఆలోచన కూడా చేయలేదు. నిత్యావసర వస్తువుల కోసం.. జనంది పోరాటమే అవుతోంది. నెలాఖరు అయ్యేసరికి.. జీతాలు అందుతాయో లేదో ప్రైవేటు ఉద్యోగులకు అనుమానాస్పదంగా మారింది. వారి యజమానులైనా… బిజినెస్ జరగకుండా… ఎక్కడి నుంచి జీతాలు తీసుకొచ్చి చెల్లిస్తారు..? ప్రజల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి.. కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలు సహకరించలేదనే నిందలు వేయడం.. అసహజం. ముందు ప్రభుత్వానికే బాధ్యత లేనప్పుడు.. ప్రజలు మాత్రం సొంతంగా బాధ్యత ఎలా తీసుకుంటారు..? కరోనా వస్తే చస్తాం.. ముందు బయటకు వెళ్లి ఏదో ఒకటి సంపాదించుకోకపోతే.. కరోనా రాకపోయినా.. ఆకలి చావు చస్తామని.. కొన్ని వేల కుటుంబాలు కుమిలిపోతున్నది నిజం. ప్రభుత్వం ఇచ్చే సాయాలు.. వారికి ఎంత వరకు కడుపు .. ఎప్పుడు నింపుతాయో.. అంచనా వేయడం కష్టం.
ఎన్నికలకు లేని ముప్పు.. సొంత రాష్ట్రంలోకి సొంత ప్రజలు వస్తే వచ్చేస్తుందా..?
ఎక్కడివాళ్లక్కడ ఉండిపోవాలని.. సొంత ప్రాంతానికి కూడా వెళ్లకూడదని.. కొత్తగా నీతులు వల్లిస్తున్నారు పాలకులు. ఇలాంటి పాలకులు వారం క్రితం.. అసలు కరోనా వైరస్సే కాదని వాదించారు. ఇప్పుడు.. సొంత రాష్ట్రంలోకి సొంత ప్రజల్ని రానివ్వనంత భయంకరంగా వైరస్ కనిపిస్తోంది. పాలకులకు ప్రజలు బిడ్డల్లాంటి వాళ్లు. వాళ్లు రోడ్డు మీద ఉంటే.. ఏదో పరిష్కారమార్గం చూపించాలి. అంతే కానీ.. ఏమీ చెప్పకుండా.. అలా వదిలేయడం.. పాలకుల లక్షణం కాదు. సొంత పిల్లలు విదేశాల్లో ఉంటే పిలిపించుకుంటాం. భారతీయులు విదేశాల్లో ఇరుక్కుపోతే ప్రత్యేక విమానాల్లో తీసుకు వస్తున్నాం. ఇవన్నీ కరెక్టే అనిపిస్తాయి.. కానీ సొంత రాష్ట్రంలోకి మాత్రం.. అడుగపెట్టడానికి నిబంధనలు గుర్తొస్తాయి. మళ్లీ తప్పు.. ఆ వచ్చే ప్రజలదే అని తిరుగు నిందులు వేయడం.. కొత్త పోకడ. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వాలంటే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
ఏ కోణంలో చూసినా.. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రజలు బాధితులుగా ఉన్నారు. అది వారిని ఆర్థికంగా కుంగదీయబోతోంది. ఆరోగ్యపరంగా క్షీణించేలా చేయబోతోంది. ఇప్పుడు ఎవరిది తప్పు అని లెక్కించుకునే పరిస్థితి కాదు. అందరూ కలసికట్టుగా… కరోనాపై జయించాల్సిన తరుణం. అందరూ.. బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం. ప్రభుత్వం.. తాము చెప్పినట్లు చేయాల్సిందేనని ప్రజల్ని బలవంత పెడితే ప్రయోజనం ఉండదు. వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే.. ఇద్దరికీ బాధ్యత వస్తుంది. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది.