కరోనా అనుమానితులు ఎక్కడున్నా.. పట్టుకుని…క్వారంటైన్.. ఐసోలేషన్ కు తరలించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. లక్షల మంది ఉన్న వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుంటున్నామని.. ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టామని ప్రభుత్వ వర్గాలు గొప్పగా చెబుతున్నాయి. అయితే.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితి మాత్రం.. కరోనా అనుమానితులు అసలు ఆస్పత్రిలో ఉంటున్నారో.. పారిపోతున్నారో కూడా గుర్తించని పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో… గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే హఠాత్తుగా అతను కనిపించకుండా పోయాడు.
ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉన్నా.. అతని వివరాలు అన్నీ ఉన్నా… ఆ రోగి ఎటు పోయాడో మాత్రం.. ట్రేస్ చేయలేకపోయారు. చివరికి అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కరోనా లక్షణాలతో చేరే వారికి ఏర్పాటు చేసే ఐసోలేషన్ వార్డులు అత్యంత భద్రత మధ్య ఉంటాయి. అందులోకి వెళ్లే వారికి.. పూర్తి స్థాయి మాస్కులు… డ్రెస్సులు ఉంటాయి. అక్కడ్నుంచి డాక్టర్లు తప్ప.. పేషంట్లు బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. అప్పటికే రోగులకు.. దుస్తులు కూడా మార్చేసి ఉంటారు. కరోనా అనుమానితుడు అని గుర్తు పట్టేలా డ్రెస్సింగ్ కూడా ఇచ్చే ఉంటారు.
అలాంటిది.. అనుమానితుడు.. నేరుగా ఆస్పత్రి ఐసోలేషన్ రూం నుంచి పారిపోవడం .. పట్టించుకోవాల్సిన వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి సాక్ష్యం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా ఉందో లేదో.. అతని టెస్టు రిపోర్టు వచ్చిన తర్వాత తేలుతుంది. ఒక వేళ కరోనా ఉందని తేలితే మాత్రం.. గుంటూరు, విజయవాడల్లో .. ఓ రకమైన భయానక వాతారణం ఏర్పడుతుంది.