మధ్యతరగతి ప్రజలకు ఆర్బీఐ అతి పెద్ద రిలీఫ్ ప్రకటించింది. వివిధ రకల రుణాలపై ఈఎంఐలపై మూడు నెలల పాటు మారటోరియడం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో.. హోమ్ లోన్, కార్ లోన్లు సహా… వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారందరూ.. మూడు నెలల పాటు ఈఎమ్ఐల టెన్షన్ తప్పించుకోవచ్చు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కావడం.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అన్ని రంగాల ఉత్పాదకత తగ్గిపోయింది. ఈ క్రమంలో ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో.. ఈఎమ్లు కట్టడం అంటే సాధ్యం కాని అంశంగా భావించిన ఆర్బీఐ.. ఈ మేరకు.. మూడు నెలల పాటు మారటోరియడం విధించడమే మంచిదని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు.. అధికారిక ప్రకటన చేసింది.
కమర్షియల్ బ్యాంకులే కాకుండా.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు కూడా..ఈ ఈఎమ్ఐ మారటోరియాన్ని అమలు చేయనున్నాయి. వైరస్ ప్రభావం దేశంపై తీవ్రంగా పడే పరిస్థితి ఉండటంతో.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటేనే కానీ.. వ్యవస్థ గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే.. భారీగా వడ్డీ రేట్లు తగ్గించాలనే ఆలోచన ఆర్బీఐ చేసింది. రెపోరేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రివర్స్ రెపోరేటును 90 పాయింట్లకు కుదించింది. దీంతో.. రుణాలు మరింత చౌకవడ్డీ రేట్లకు లభించనున్నాయి. వైరస్ వ్యాప్తి, దాని తీవ్రత ఎంత కాలం కొనసాగనుందన్న అంశాలపైనే భవిష్యత్తు వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయని దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు, రోజు కూలీల్ని ఆదుకోవడానికి రూ. లక్షా 70వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. మెజార్టీ కుటుంబాలు.. ఆ ప్యాకేజీలో లబ్ది పొందనున్నాయి. ఇప్పుడు.. మధ్యతరగతి ప్రజలు కూడా.. ఈఎమ్ఐ మారటోరియంతో.. ఎంతో కొంత లబ్దిపొందుతారు. వారికి ఆర్థిక పరమైన లబ్ది సంగతేమో కానీ… ఈ గందరగోళ పరిస్థితుల్లో.. ఆదాయం వస్తుందో రాదో.. రాకపోతే.. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్న టెన్షన్ మాత్రం తీరిపోతుంది.