ఈఎంఐలు కట్టాల్సిన వాళ్లందరికీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మూడు నెలల పాటు ఎలాంటి ఈఎంఐ చెల్సించాల్సిన అవసరం లేదని చెప్పి, మధ్యతరగతివాళ్లకు ఉపశమనం కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి అద్దెలు కట్టుకోవడమే గగనం అయిపోతుంది. ఇక వడ్డీలు, వాయిదాలూ అంటే చాలా కష్టం. నిజంగా ఇది శుభపరిణామం.
అయితే… నిర్మాతలకు అప్పులిచ్చే షైనాన్షియర్లూ కాస్త పెద్ద మనసుచేసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది. చిత్రసీమ అంటే హీరోల చుట్టూ, దర్శకుల చుట్టూ తిరిగే వ్యవస్థ మాత్రమే కాదు. అందులో ఫైనాన్షియర్లూ కీలక పాత్ర పోషిస్తుంటారు. సినిమా ఎంత పెద్దదైనా సరే, వెనుక బడా బడా నిర్మాత ఉన్నా సరే – ఫైనాన్షియర్ సహాయం తీసుకోవడం తప్పనిసరి. వాళ్ల వడ్డీలు కూడా వేరే స్థాయిలో ఉంటాయి. సినిమా విడుదలకు ముందు ఫైనాన్షియర్లకు సర్దుబాటు చేయాల్సిందే. అడిగినంత ఇవ్వాల్సిందే.
కరోనా ప్రభావంతో నిర్మాతలు వణికిపోయేది ఈ వడ్డీల భారాన్ని తలచుకునే. షూటింగులు ఆగిపోయాయి. సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో చెప్పలేం. ఈలోగా తెచ్చుకున్న అప్పుకి వడ్డీ కొండలా పెరిగిపోతుంటుంది. సినిమా పూర్తయి, విడుదలై, చేతికి డబ్బులు అందేంత వరకూ ఆ వడ్డీ ఎక్కడ ఆగుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ బాధని బడా ఫైనాన్షియర్లు అర్థం చేసుకోవాల్సిందే. వాళ్లు పెద్ద మనసు చూపించాల్సిందే. ఈ లాక్ డౌన్ వల్ల ఆలస్యమయిన సినిమాలపై, నిర్మాతలపై కరుణ చూపించాల్సిందే. వడ్డీ తగ్గించుకోవడమో, లేదంటే ఈ లాక్ డౌన్ కాలానికి వడ్డీ వసూలు చేయకపోవడమో, లేదంటే మినహాయింపు ఇవ్వడమో చేస్తే తప్ప ఏ నిర్మాతా కోలుకోడు. సినిమా అనేది ఓ చక్రం. అందులో 24 విభాగాలూ ఇరుసులే. ఒక్కటి గాడి తప్పినా – ఆ చక్రం ఆగిపోయే ప్రమాదం నెలకుంటుంది. ఈ విషయం చిత్రసీమలో ఉంటున్నవాళ్లకి తెలియంది కాదు. ప్రభుత్వాలు ప్రజలపై కరుణ చూపించినట్టు, ఈ ఫైనాన్షియర్లూ నిర్మాతల జీవితాన్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని, వడ్డీని మినహాయించుకుంటే – నిర్మాతలకు కొండంత చేయూత అందించినట్టు అవుతుంది.