దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ప్రజా ప్రయోజన చర్యలను ప్రకటించింది. ఇ.ఎమ్.ఐ.లపై మూడు నెలలపాటు మారటోరియం విధించింది. మార్చి 1 నుంచి ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, ఇది వెంటనే అమల్లోకి వచ్చేసినట్టా అంటే… కాదనే చెప్పాలి. ఎందుకంటే, దీనిపై బ్యాంకులు ప్రకటన చెయ్యాల్సి ఉంటుంది. బ్యాంకులు ఆమోదం తెలిపితేనే వినియోగదారులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఆర్.బి.ఐ. ప్రకటించిన మారటోరియంపై బ్యాంకులన్నీ సమావేశమై చర్చించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకూ బ్యాంకుల నుంచి ఈ నిర్ణయం అమలుపై ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు.
ఆర్.బి.ఐ. నిర్ణయంపై చాలామందిలో అనుమానాలున్నాయి. మూడు నెలల ఇ.ఎమ్.ఐ. రద్దు అయిపోయినట్టే అని కొంతమంది భావిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. ఇది అవాస్తవం. మూడు నెలలపాటు వాయిదా మాత్రమే ఇది! అంటే, లోన్లు తీసుకున్నవారి చెల్లింపు పరిమితి ఓరకంగా మరో మూడు నెలలు పెరిగినట్టయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఖాతాల్లో నగదు వెసులుబాటు కోసం మాత్రమే ఈ నిర్ణయాన్ని ఆర్.బి.ఐ. తీసుకుంది. తాజా నిర్ణయాన్ని బ్యాంకులు అమల్లోకి తీసుకొస్తే… పర్సనల్, ఎడ్యుకేషన్, హోమ్, వెహికల్ లోన్లకు ఈ మూడు నెలల ఇ.ఎమ్.ఐ. వాయిదా పడుతుంది. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని కొనుక్కున్న వస్తువులకు కూడా ఇది వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డుల ఈ నిర్ణయానికి మినహా అని నిపుణులు చెబుతున్నారు. అంటే, క్రెడిట్ కార్డు కొనుగోళ్లు చేసి… వాటిని ఇ.ఎమ్.ఐ.లు కన్వర్ట్ చేసుకున్నవారు యథాతథంగా చెల్లించాల్సిన ఉంటుందని అంటున్నారు. అయితే, ఆయా బ్యాంకులు దీనిపై ప్రకటన చేస్తే, మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయం చాలామందికి కొంత ఊరట కలిగించేదే. ఎందుకంటే, లాక్ డౌన్ సమయంలో కార్యాలయాలు మూసేసినవారికి రాబోయే నెల జీతాల పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన కొంతమంది ప్రైవేటు ఉద్యోగుల్లో ఉంది. పైగా మూడు వారాల లాక్ డౌన్ అంటున్నారు కాబట్టి, ఎలా ఉంటుందో చూడాలి. ఇదోక అత్యవసర పరిస్థితి కాబట్టి, ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలూ కొంత ఉదారంగానే వ్యవహరిస్తాయని భావించొచ్చు.