దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. పిట్ట బయట కనపడినా ఊరుకునేది లేదని కేంద్రంతో పాటు రాష్ట్ర పభుత్వాలు కూడా కొరడా ఝళిపస్తున్నాయి. రైతు బజార్లలో కూరగాయల కొనుగోళ్లు, నిత్యావసరాలైన పాలు, వివిధ సరుకుల కొనుగోలు కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణిత సమయాలలో ప్రజలకు అనుమతి ఇస్తున్నాయి. తొలి రోజుతో పోలిస్తే రోడ్ల మీదకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. అయినా అడపా దడపా జనాలు వస్తూనే ఉన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు గొడవంతా మందుబాబులతోనే వస్తోంది. గత ఆదివారం నాడు కేంద్రం జనతా కర్య్ఫూ ప్రకటించింది. ఆ ఒక్క రోజు ఇళ్లలో ఉంటే ఇక కరోనా రాదులే… అని దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రజలు జనతా కర్య్ఫూ కు సహకరించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా భారతదేశం మొత్తం ఈ జనతా కర్య్ఫూకు తన సహాయాన్ని అందించింది. దీనికి మందు బాబులు కూడా తమ వంతు సాయం అందించారు. జనతా కర్య్ఫూ కు ముందు రోజైన శనివారం నాడే చాలా మంది ఆదివారం కోసం మందూమాకు సిద్ధం చేసుకున్నారు. తీరా ఆదివారం సాయంత్రం కాగానే కేంద్రం, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లాక్ డౌన్ బాంబు పేల్చయి. తొలి రోజు దీన్ని లైట్ గా తీసుకుని మందు బాబులు షాపుల తెరుచుకుంటాయిలే అని భావించారు. అయితే, లాక్ డౌన్ ను ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక్క మద్యం దుకాణం కూడా తెరుచుకోకుండా చర్యలు తీసుకోవడంతో మందు బాబుల కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజూ గడుస్తున్న కొద్దీ మందు బాబులకు మందు కరవైంది. తెలంగాణలో అయితే మద్యం అమ్మకాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణలో శుభమైనా, అశుభమైనా, మంచైనా, చెడైనా మందు ఉండాల్సింది. దీంతో తెలంగాణలో మందు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. శుక్రవారం నాడు “మందు లేకపోతే ఎలా…కనీసం రోజుకు రెండు గంటలైనా మందు దుకాణాలు తెరవండి. మా మగవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు” అంటూ కొందరు మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. “మాయదారి రోగం కరోనా వస్తదో.. రాదో.. ఎవ్వరికీ ఎరిక లేదు.తాగుడు బంద్ అయితే మాత్రం సానా కష్టంగా ఉంది” అంటూ ఆ వీడియోలో మహిళలు వాపోయారు. శుక్రవారం రాత్రి అయితే మందు దొరకక ఓ మందు బాబు ఏకంగా బేగంపేట ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో రోజుల పాటు తెలంగాణలో మద్యం అందుబాటులోకి రాకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని ప్రతి చోటా ఆందోళన వ్యక్తం అవుతోంది.