కరోనా మహహ్మారిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సినీ లోకం తమ వంతు సహాయం ప్రభుత్వానికి అందిస్తోంది. అన్నార్తులను ఆదుకోవడానికి సెలబ్రెటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు విరివిగా విరాళాలు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రముఖ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
ఫేస్ బుక్ ద్వారా శని, సోమ, బుధ, గురువారాల్లో ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకూ అభిమానులు కోరిన పాటల్ని ఆలపిస్తారు. అందుకోసం అభిమానులు కేవలం వంద రూపాయలు చెల్లిస్తే చాలు. `ఫస్ట్ కమ్ ఫస్ట్` అన్నట్టు ఎవరు ముందుగా కోరితే.. ఆ పాటలన్నీ బాలు పాడతారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సొమ్ముతో, తన వంతుగా కొంత జోడించి ప్రభుత్వానికి అందజేస్తారు. కేవలం వంద రూపాయలతో మనకిష్టమైన పాటని బాలు నోటి వెంట వినొచ్చు. తద్వారా కరోనా వైపరిత్యంపై పోరాటానికి పరోక్షంగానూ సహాయం చేయొచ్చు. మంచి ఆలోచనే కదూ. మిగిలిన గాయనీ గాయకులు ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకొస్తే… ప్రభుత్వానికీ, సమాజానికి తమ వంతు సేవ చేసినవాళ్లవుతారు.