ఇన్నేళ్ల సినీ జీవితంలో పవన్ కల్యాణ్ ఒక్కసారి కూడా ద్విపాత్రిభినయం చేయలేదు. డ్యూయెల్ రోల్ అనేది ట్రెండ్‌గా మారి, ప్రతీ హీరో విధిగా ఒక్కసారైనా ఆ టైపు కథల్ని ఎంచుకుంటున్న సీజన్లోనూ పవన్ వాటి జోలికి వెళ్లలేదు. ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఓ వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. పవన్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని ప్రచారం మొదలైంది.
నిజానికి ఇందులో పవన్ సింగిలే. డబుల్ కాదు. ఔరంగజేబు పరిపాలనా కాలం నాటి కథ ఇది. పవన్ ఓ గజ దొంగగా నటిస్తున్నాడు. పవన్ తండ్రి, అన్న లాంటి పాత్రలు ఈ సినిమాలో లేవు. పైగా కథంతా.. పిరియాడికల్ డ్రామానే. ప్రజెంట్ – పాస్ట్ అంటూ రెండు కోణాలు కూడా లేవు. అలాంటప్పుడు ఈ గాసిప్ ఎలా మొదలైందో ఏమో..? ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ రూ.100 కోట్లపైమాటే. పాన్ ఇండియా రేంజులో ఈ సినిమాని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాత ఆలోచన.