“డబ్బులు ఊరకనే రావు” అంటూ ప్రజలకు మాటలు చెబుతూ.. ప్రకటనలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టే లలితా జ్యూయలర్స్ ఓనర్ కిరణ్ కుమార్‌కు హఠాత్తుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ప్రేమ పొంగుకొచ్చింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి వారికి అండగా ఉండాలంటూ… ప్రకటనలు ఇచ్చేశారు. ప్రజలకు అండగా ఉండటానికి… ప్రజల మీద ఆధారపడి.. ప్రభుత్వాల మీద ఆధారపడి సంపాదించుకున్న వాళ్లంతా… తమకు తోచినంతగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి.. పీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ఇస్తూంటే… కిరణ్ కుమార్.. మాత్రం భిన్నంగా ఆలోచించారు. ప్రజలకు ప్రభుత్వాలు అండగా ఉంటాయ్.. మరి ప్రభుత్వాధినేతలకు ఎవరు అండగా ఉంటారని అనుకున్నారేమో.. తానే ఆ బాధ్యత తీసుకున్నారు. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చేశారు. అదీ కూడా ఫ్రంట్ పేజీ.. దానితో పాటు రెండో పేజీ కూడా. అంటే.. రెండు పేజీల కలర్ ఫుల్ యాడ్.
ఇక్కడ ముఖ్యమంత్రులకు ఎందుకు అండగా ఉంటున్నారని అనాల్సి వచ్చిందంటే.. వారికి చెందిన పత్రికలకు మాత్రమే… ప్రకటనలు ఇచ్చారు కాబట్టి. సాక్షి దినపత్రిక, నమస్తే తెలంగాణలకు మాత్రమే.. లలితా జ్యూయలర్స్ తరపున అన్ని ఎడిషన్లకు ఫుల్ పేజీ ప్రకటనలు వెళ్లిపోయాయి. ఎప్పుడూ లలితా జ్యూయలర్స్ ప్రకటనలు వచ్చినా.. తాను మాత్రమే కనిపించే కిరణ్ కుమార్ ఈ సారి ప్రోటోకాల్ పాటించారు. నమస్తే తెలంగాణలో కేసీఆర్… సాక్షిలో జగన్ ఫోటోలను మాత్రమే హైలెట్ చేశారు. అలాగని.. తన ఫోటో మిస్ కాలేదు. కాకపోతే.. సైజ్ తగ్గించుకున్నారు. తెలంగాణలోని సాక్షి ఎడిషన్లకు కూడా ప్రకటన ఇచ్చారు. కాకపోతే.. అక్కడ కేసీఆర్‌కు అండగా ఉందామని పిలుపునిచ్చి.. తెలివి తేటల్ని చూపించారు.
ప్రస్తుతం ఉన్న యాడ్ రేట్ల ప్రకారం… అన్ని ఎడిషన్లలో రెండు పత్రికల్లో.. ఇలా రెండు పేజీల యాడ్ ఇవ్వాలంటే.. కనీసం రూ. రెండు, మూడు కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా ఉంది. లాక్ డౌన్ కారణంగా.. వ్యాపారాలన్నీ మూత వేయాల్సిన పరిస్థితుల్లో.. ఏ ఒక్కరూ కూడా పేపర్ ప్రకటనల జోలికి పోవడం లేదు. అలాంటిది.. కిరణ్ కుమార్ మాత్రం.. తనకు డబ్బులు ఊరకనే వచ్చేస్తున్నట్లుగా.. ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అన్ని పత్రికలకూ ప్రకటనలు ఇచ్చి ఉంటే… దీని వెనుక ఏదో మతలబు ఉందని ఎవరూ అనుకుని ఉండేవారు కాదు. కానీ ప్రభుత్వాధినేతలకు చెందిన పత్రికలకు మాత్రమే ప్రకటనలు ఇవ్వడంతోనే అనుమానాలు వస్తున్నాయి.
డబ్బులు ఊరకనే రావనే కిరణ్ కుమార్.. ఊరకనే ఇలా ఖర్చు పెట్టరు. దానికి రెండు, మూడింతల ప్రయోజనం ఆశిస్తారు. అదేమిటో కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. తన బిజినెస్ మైండ్ తో… గేమ్ ఆడేస్తున్నారని మాత్రం.. అనుకోక తప్పదు.