అమెరికా ఇప్పుడు కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. పాజిటివ్ కేసులు లక్షకు చేరాయి. పదమూడు వందల మందికిపైగా కరోనాకు బలయ్యారు. ట్రంప్ ఎంత ఈజీగా తీసుకున్నారో… అంత ఎన్నో రెట్లు ప్రమాదకరంగా… కరోనా అమెరికాలో విస్తరించింది. ఇప్పుడు అమెరికా మొత్తం భయానక పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలోనూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదు. అమెరికాను షట్ డౌన్ చేయడానికి అంగీకరించడం లేదు. కరోనా వల్ల వస్తున్న నష్టం కన్నా.. లాక్ డౌన్ చేస్తే.. వచ్చే నష్టమే ఎక్కువని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. బహుశా ఆయన అనుకునే నష్టం.. అగ్రరాజ్యం హోదాను… అమెరికా కోల్పోతుందనే ఆందోళన కావొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్‌కు పేద, ధనిక తేడా తెలియదు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఎవరు నిర్లక్ష్యంగా ఉండి ఆహ్వానిస్తే.. వారి దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనాను.. ఆహ్వానించక తప్పలేదు. అయితే.. చైనా ఎంత క్రమశిక్షణతో వైరస్ ను ఎదుర్కొందో.. అమెరికాలో అంత నిర్లక్ష్యం కనిపించింది. అందుకే ఆ దేశం తీవ్రంగా ప్రభావితమవుతోందన్న అంచనాలున్నాయి. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు 150 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి 1200 డాలర్లు అందే ఏర్పాట్లు చేశారు. అయితే.. కరోనా కంట్రోల్ కాకుండా.. ఈ ప్యాకేజీలేవీ అమెరికాను గట్టెక్కించే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు అమెరికాలో కరోనా కంట్రోల్ అవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టంగా మారింది.
అమెరికాలో అత్యంత వేగంగా పాజిటివ్ కేసులు నమోదవడాన్ని ట్రంప్.. తమ సామర్థ్యంగా చెప్పుకుంటున్నారు. అది తమ టెస్టింగ్ సామర్థ్యమన్నట్లుగా ఆయన చెబుతున్నారు. నియంత్రించేందుకు మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు మాత్రం ఎదుర్కొంటున్నారు.. అమెరికా అధ్యక్షుడు.. కరోనాను లైట్ తీసుకుని దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. తాను ట్రంప్ ప్లేస్‌లో ఉంటే ఖచ్చితంగా లాక్డౌన్ ప్రకటించేసేవారమని… బిల్ గేట్స్ లాంటి వాళ్లు నేరుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా.. ట్రంప్‌లో మాత్రం చలనం ఉండటం లేదు. అలా చేయడం చాలా నష్టమంటున్నారు. కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఆయన అగ్రరాజ్య హోదాను కాపాడుకోవాలని చూస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
కరోనా వైరస్ బయటపడిన చైనాలో.. పరిస్థితి మెరుగుపడింది. వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేశారు. అక్కడ సాధారణ జీవితాన్ని ప్రజలు ప్రారంభించేశారు. పరిస్థితులు మెరుగుపడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి కూడా ప్రారంభమయింది. ప్రపంచంలో ఇప్పుడు సేఫ్ గా ఉన్న దేశం ఏది అంటే.. ఒక్క చైనా మాత్రమే. ఆర్థిక పరంగా.. ప్రపంచ దేశాన్ని సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ చైనా మాత్రం.. వెలుగు లీననుంది. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ట్రంప్.. అమెరికాను లాక్ డౌన్ చేసి.. చైనా.. తమ కన్నా ముందుకు వెళ్లేలా చేయడానికి సిద్ధపడటం లేదు.