హైదరాబాద్:ఆమరణ నిరాహారదీక్షతో సంచలనం సృష్టించిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇవాళ కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, తనకు ఎలాంటి పదవులూ అవసరంలేదని చెప్పారు. ఏడు నెలల్లో మంజునాథ కమిషన్ నివేదిక ఇస్తుందని ప్రభుత్వం తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడు నెలల కాలంలో తనకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చకుంటే మళ్ళీ ఉద్యమ బాట పడతానని హెచ్చరించారు. తుని విధ్వంసకాండకు సంబంధించి విచారణ జరపకుండా కేసులు నమోదు చేస్తే తాను ఊరుకోబోనని అన్నారు. అమాయకులను జైలుకు పంపిస్తే తాను కూడా జైలుకు వెళతానని చెప్పారు. తనకు పలు హామీలు ఇచ్చినందువల్లే దీక్ష విరమించానని, వాటిని నెరవేర్చకుంటే మళ్ళీ రోడ్డెక్కుతానని ముద్రగడ అన్నారు. తన ఉద్యమం 20 శాతం మాత్రమే సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సమచారంతో ప్రభుత్వానికి, కమిషన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నెల 25లోపు రుణాలకోసం కాపులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కిర్లంపూడిలో పురుగులమందు తాగిన కాపు సోదరుడిని ఆసుపత్రికి తరలించిన అడిషనల్ ఎస్పీ దామోదర్‌కు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు.